
పేదల సంక్షేమమే లక్ష్యం
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడి
ఖమ్మం అర్బన్ : పేదల అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలోని 57వ డివిజన్ రమణగుట్ట ప్రాంతంలో రూ.2.36 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 57వ డివిజన్‌లో పేదలు అధికంగా ఉన్నందున ఎక్కువ నిధులు కేటాయించామని తెలిపారు. నగరానికి రెండు వేల ఇళ్లు మంజూరు చేస్తే అందులో 200పైగా ఈ డివిజన్‌కే అందించామని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులు నాణ్యతతో ఉండాలని, పాఠశాల నిర్మాణ ప్రతిపాదనలు త్వరలో ఆమోదం పొందుతాయని చెప్పారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ 57వ డివిజన్‌లో 230 మందికి ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. నగర పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య, ఆర్డీఓ నరసింహారావు, మున్సిపల్ ఈఈ వి.రంజిత్, అర్బన్ తహసీల్దార్ సైదులు, మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, మహ్మద్ రఫీదా బేగం, మలీదు వెంకటేశ్వర్లు, నాయకులు ఎండీ ముస్తఫా, మిక్కిలినేని నరేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, దొబ్బల సౌజన్య, రావూరి సైదబాబు, పైడుపల్లి సత్యనారాయణ, దీపక్‌చౌదరి, సాధు రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.