
కమీషన్ అందక ఇక్కట్లు
ఖమ్మం సహకారనగర్/ నేలకొండపల్లి: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులకు నెలనెలా బియ్యం పంపిణీ చేసే డీలర్లకు కమీషన్ సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే కమీషన్ ఐదు నెలలుగా బకాయి ఉండడంతో నెలవారీఖర్చులకు అవస్థపడుతున్నామని వాపోతున్నా రు. ఏప్రిల్, మే నెలకు సంబంధించి రాష్ట్ర కమీషన్ విడుదలైనా ఆతర్వాత రాలేదని, కేంద్రం నుంచి మాత్రం ఐదు నెలలుగా విడుదల కాలేదని చెబుతున్నారు.
క్వింటాకు రూ.1.40 కమీషన్
కిలో బియ్యానికి రూ.1.40 చొప్పున క్వింటాకు రూ. 140 కమీషన్‌ను ప్రభుత్వం డీలర్లకు చెల్లిస్తోంది. ఇందులో కేంద్రం వాటా 45 పైసలు, రాష్ట్ర వాటా 95 పైసలుగా ఉంది. ఒక డీలర్ నెలలో 250 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తే కమీషన్ రూ.35 వేలు రావాలి. కానీ ఐదు నెలలుగా పెండింగ్ ఉండడంతో నిర్వహణ ఖర్చులకు ఇబ్బందిగా మారినందున డీలర్లు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. కాగా, జిల్లాలో 748 రేషన్‌షాపులు ఉండగా, 4,52,758 కార్డుల ద్వారా నెలకు 81,45,723 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు.
రేపు వినతిపత్రాలు..
ఐదు నెలలుగా కమీషన్ విడుదల చేయాలని కోరు తూ సోమవారం జిల్లావ్యాప్తంగా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు డీలర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బానోతు వెంకన్న, షేక్ జానీమియా, నాయకుడు దుర్గయ్య తెలిపారు. ఈమేరకు శనివారం ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. అయినా స్పందన రాకపోతే డీలర్లు వరుస ఆందోళనలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.