
మరింత పారదర్శకంగా..
● జూనియర్ కాలేజీల్లో ‘ఎఫ్‌ఆర్‌ఎస్’ హాజరు ● అమల్లోకి వచ్చిన నూతన విధానం
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్)ను అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో జిల్లాలోని 21 ప్రభుత్వ కాలేజీల్లో ప్రారంభించారు. ఈనేపథ్యాన సోమవారం ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,779మంది విద్యార్థుల హాజరును ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంలో నమోదు చేశారు. ప్రతి రోజు ఉదయం 9–40నుంచి 10గంటల్లోపు, మధ్యాహ్నం 1–45నుంచి 2గంటల వరకు రెండు పూటలా హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది.
గైర్హాజరైతే తల్లిదండ్రులకు మెసేజ్
పలు జూనియర్ కాలేజీలకు విద్యార్థులు సకాలంలో రాకపోగా, వచ్చినా సాయంత్రం వరకు ఉండడం లేదు. దీంతో నానాటికీ హాజరుశాతం తగ్గుతోందని ప్రభుత్వం గుర్తించింది. ఈమేరకు హాజరు నమోదు పెంచడమే పాటు పక్కాగా నమోదు చేసేలా ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అంతేకాక ఎవరైనా విద్యార్థి కళాశాలకు రాకపోతే వారి తల్లిదండ్రుల ఫోన్‌కు మెసేజ్ పంపేఏర్పాట్లు చేశారు. తద్వారా హాజరుశాతం పెరిగి డ్రాపౌట్లు తగ్గుతాయని చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం విద్యార్థులకే ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేస్తుండగా... త్వరలో అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లకు అమలయ్యే అవకాశముందని సమాచారం.
ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేస్తుండడంతో విద్యార్థుల హాజరు వివరాలు తల్లిదండ్రులకు తెలిసిపోతాయి. తద్వారా రెగ్యులర్‌గా కాలేజీకి వచ్చే అవకాశముంది. ఈమేరకు క్రమం తప్పక పాఠాలు వింటూ అధ్యాపకుల సూచనలు పాటిస్తే మెరుగైన ఫలితాలు నమోదవుతాయి.
– రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి