
గణపతి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
అందరూ స్వీయనియంత్రణ పాటించాలి
సమీక్షలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మంగాంధీచౌక్: గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా, ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పా ట్లు చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలి పారు. కలెక్టరేట్‌లో సోమవారం గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై అధికారులు, ఉత్సవ కమిటీలతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. విగ్రహాల తరలింపు సమయాన విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలని, నిమజ్జనం చేసేరోజు అందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు. అలాగే, నిమజ్జనం పాయింట్ల వద్ద బారికేడ్లు, క్రేన్లు, విద్యుత్ సరఫరా, తాగునీరు, లైటింగ్ ఏర్పాట్లు, మధ్య నిషేధం అమలు, ప్రాథమిక చికిత్స కేంద్రాల ఏర్పాటు, గజ ఈతగాళ్ల నియామకంపై సూచనలు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ మాట్లాడుతూ వివాదాస్పద ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటుచేయొద్దని తెలిపారు. అలాగే, నిమజ్జనం రోజున రూట్ మ్యాప్ ఖరారుపై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యాన మట్టి విగ్రహాల ఆవశ్యకతపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. డీఆర్‌ఓ ఏ.పద్మ శ్రీ, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, డీపీఓ ఆశాలత, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, జిల్లా అగ్నిమాపక అధికారి అజయ్‌కుమార్, జిల్లా రవాణా అధికారి వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు వి.వేణుగోపాల్‌రెడ్డి, వెంకట్రాం, పవార్, అనిల్‌కుమార్, నాగేశ్వరరావు, యు.మహేష్‌బాబు, రవీందర్, గణేష్ ఉత్సవ కమిటీల బాధ్యులు విద్యాసాగర్, జైపాల్‌రెడ్డి, ప్రసన్నకష్ణ, సాయికిరణ్ పాల్గొన్నారు.
గణపతి మండపాలకు ఉచిత విద్యుత్
వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉచిత విద్యుత్ అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. పది రోజుల కాల పరిమితితో ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ, గత ఏడాది మాదిరిగానే మండపాలు, విద్యుత్ సామర్థ్యం వివరాలను యాప్‌లో పొందుపర్చాలని తెలిపారు. కాగా, ఒక కిలోవాట్ లోడ్ వరకు రూ.1,560ల నుంచి రెండు కిలోవాట్ల లోడ్ వరకు రూ.3,020గా చార్జీలు నిర్ణయించగా, ఈ నగదును ప్రభుత్వం డిస్కంలకు చెల్లించనుంది.
రూ.2లక్షలతో ‘స్వగృహ’ రిజిస్ట్రేషన్
రాజీవ్ స్వగృహ జలజ టౌన్ షిప్‌లో ఫ్లాట్ల కోసం ఆసక్తి ఉన్న ఉద్యోగులు ఈనెల 30లోగా రూ.2లక్షల చెల్లించి రిజిస్టర్ చేసుకోవచ్చని కలెక్టర్ అనుదీప్ సూచించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, రాజీవ్ స్వగృహ సీఈ భాస్కర్‌రెడ్డితో కలిసి కలెక్టరేట్‌లో సమావేశమైన ఆయన మాట్లాడుతూ 9. 22 ఎకరాల్లో ఎనిమిది టవర్లుగా నిర్మించిన 576 ఫ్లాట్లు అసంపూర్తిగా ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గజం భూమి రూ.1,150 ధరగా నిర్ణయించినట్లు చెప్పారు. ఖమ్మం – దేవరపల్లి హైవేతో కనెక్టివిటీ పెరుగుతుందని, మున్నేటి రిటైనింగ్ వాల్ నిర్మాణంతో ముంపు సమస్య ఉండదని తెలిపారు. టీజీవోస్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ, గుంటుపల్లి శ్రీనివాసరావు, డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, డీఆర్‌డీఓ సన్యాసయ్య పాల్గొన్నారు.