
బాబోయ్.. డెంగీ
వంద దాటిన కేసులు.. ఈ నెలలోనే 80
గత పది రోజుల్లో
సీజనల్ జ్వరాలు మరింతగా వ్యాప్తి
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు పెరుగుతున్న తాకిడి
ఈ ఏడాది నమోదైన డెంగీ కేసులు
ఖమ్మంవైద్యవిభాగం: వాతావరణంలో మార్పులతో జిల్లావాసులు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పారిశుద్ధ్య లోపం ఏర్పడగా గ్రామాలు, పట్టణాల్లో దగ్గు, జలుబు, గొంతునొప్పి తదితర సమస్యలతో జనం ఆస్పత్రులకు బారులు దీరుతున్నారు. దీనికి తోడు డెంగీ కేసులు హడలెత్తిస్తున్నాయి. వర్షాలు తగ్గాక పారిశుద్ధ్య సమస్యతో దోమలు వృద్ధి చెందడం జ్వరాల వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. గత పది రోజులుగా సీజనల్ వ్యాధులు వృద్ధితో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు జిల్లా ఆస్పత్రి సైతం కిటకిటలాడుతోంది. ఇవి కాక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్న వారు సైతం ఎక్కువగానే ఉంటున్నారు.
113 డెంగీ కేసులు
జిల్లాలో ఇప్పటివరకు 113డెంగీ కేసులు నమోదయ్యాయి. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కట్టడికి చర్యలు చేపట్టినా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అలాగే, జ్వరం, జలుబు, దగ్గు, డయేరియాతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఎక్కువ సంఖ్యలో జ్వర పీడితులే వస్తుండగా.. నిత్యం 2వేలకు పైగా ఓపీ నమోదవుతోంది. అలాగే, ఇన్ పేషంట్ వార్డులు సైతం నిండిపోతున్నాయి. జ్వర పీడితుల కోసం ప్రత్యేక ఫీవర్ వార్డులు ఏర్పాటుచేస్తే, అందులో పదుల సంఖ్యలో డెంగీ బాధితులు వైద్యం పొందుతున్నారు.
ఈ నెలలోనే అత్యధికం
ఈ ఏడాది ఆగస్టులో ఎక్కువగా డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈనెల 1నుండి 24వ తేదీ వరకు మొత్తం 82 కేసులు వెలుగు చూశాయి. ఎం.వెంకటాయపాలెం పీహెచ్‌సీ పరిధిలో 15, మంచుకొండ 14, సుబ్లేడులో 12, తిరుమలాయపాలెం, తల్లాడలో ఎనిమిది చొప్పున, ముస్తఫానగర్, మామిళ్లగూడెం ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆరేసి కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 113 డెంగీ కేసులు వెలుగు చూడగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారిని లెక్కిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా, సీజనల్ వ్యాధుల జోరుతో ప్రైవేట్ ఆస్పత్రుల బాధ్యులు డెంగీ చికిత్స పేరిట డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జ్వరాల వ్యాప్తికి దోమలే కారణమవుతున్నాయని, అపరిశుభ్రమైన నీరు డయేరియాకు కారణమవుతోందని వైద్యులు చెబుతున్నారు. ఈమేరకు కాచి వడబోసిన నీరు, వేడి ఆహార పదార్ధాలు, పోషకాలు, పండ్లు, కూరగాయలు తీసుకోవడమే కాక పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు.
నెల శాంపిళ్లు కేసులు
జనవరి 518 00
ఫిబ్రవరి 607 02
మార్చి 408 01
ఏప్రిల్ 248 00
మే 281 00
జూన్ 614 01
జూలై 1,718 27
ఆగస్టు(24వరకు) 1,287 82

బాబోయ్.. డెంగీ