
ఈ పోరాటం ప్రారంభం మాత్రమే..
ఖమ్మం సహకారనగర్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న పోరాటాలు ప్రారంభం మాత్రమేనని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) స్టీరింగ్ కమిటీ సభ్యులు, టీఎస్‌యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి హెచ్చరించారు. ఖమ్మంలోని యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 20నెలలు దాటినా ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఈమేరకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేలా యూఎస్‌పీసీ ఆధ్వర్యాన ఈనెల 23న హైదరాబాద్ ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, నూతన జిల్లాలకు డీఈఓ పోస్టులు, ప్రతీ డివిజన్‌కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేయడమే కాక ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడమే కాక ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరించాలని పలు మారు విన్నవించినా ఫలితం లేక మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో యూఎస్‌పీసీ నాయకులు ఎస్.విజయ్, రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, ఏ.వీ.నాగేశ్వరరావు, వెంగళరావు, బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, రోజా, రామకృష్ణ, కోటేశ్వరరావు, ఉద్దండ్, నర్సింహారావు, శారద, హన్మంతరావు, పద్మజ, కోటేశ్వరరావు, షరీఫ్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
యూఎస్‌పీసీ రాష్ట్ర బాధ్యులు
చావా రవి, తిరుపతి