
సమీకృత భవనాలకు లైన్ క్లియర్!
ఖమ్మం రూరల్ మండల ఆఫీసులకు
త్వరలోనే శంకుస్థాపన
ఏదులాపురం మున్సిపాలిటీ కూడా అక్కడే..
ఖమ్మంరూరల్: ఖమ్మం రూరల్ మండల కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మించాలని ఐదేళ్ల క్రితమే నిర్ణయించినా ఎవరికి వారు తమకు అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలనే పట్టుదలకు పోవడంతో ఎటూ తేలలేదు. బీఆర్‌ఎస్ హయాంలో ఈ విషయమై ఓ అడుగు ముందుకు పడినా స్థలం ఖరారుపై వివిధ పార్టీల నాయకులు పట్టు వీడకపోవడంతో ప్రతిష్ఠంభన నెలకొంది. చివరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తరుణీ హట్‌లో మండల సమీకృత భవన నిర్మాణాలకు ఖరారు చేశారు. ఇటీవల మంత్రి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి అధికారులతో సమీక్షించారు.
అక్కడొకటి.. ఇక్కడొకటి
రూరల్ మండలం ఏర్పడిప్పటి నుండి తహసీల్, ఎంపీడీఓ, పోలీస్‌స్టేషన్లు విసిరేసినట్లుగా అక్కడొక్కటి, ఇక్కడొకటి అన్నట్లు ఉన్నాయి. తహసీల్ ఖమ్మం నగరంలో, ఎంపీడీఓ కార్యాలయం జలగంనగర్‌లో, పోలీస్‌స్టేషన్ వరంగల్ క్రాస్ రోడ్డులో కొనసాగుతున్నాయి. ప్రతీ కార్యాలయం మధ్య కిలోమీటర్‌కు పైగా దూరం ఉండడంతో పనుల కోసం కార్యాలయాలకు వెళ్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
మున్సిపాలిటీ ఏర్పాటుతో..
మండలంలోని 12 గ్రామాలను కలుపుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటైంది. దీంతో సమీకృత భవనం నిర్మిస్తే అటు మున్సిపల్ కార్యాలయం, ఇటు మండల కార్యాలయాలన్నీ ఒకేచోట కొలువుదీరే అవకాశముంది. సముదాయంలో మున్సిపల్ కార్యాలయం, సమావేశ మందిరం, రెవెన్యూ, విద్యాభవనం, వ్యవసాయ, మత్స్య పరిశ్రమ, ఉద్యానవన, శిశు సంక్షేమం, ఆర్‌అండ్‌బీ, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ ఒకే చోట నిర్మించాలనే ఆలోచనలకు వచ్చారు. తరుణీ హట్‌లో నిర్మించే సముదాయం వద్దకు 30అడుగుల రోడ్డు కూడా నిర్మించనున్నారు.
జీ ప్లస్ టూ భవనాల నిర్మాణం
మున్సిపాలిటీకి సంబంధించిన సమీకృత భవన నిర్మాణానికి గత మే నెలలోనే పరిపాలనాపరమైన అనుమతులు వచ్చాయి. దీంతో రోడ్లు భవనాల శాఖ అధికారులు జీ ప్లస్ టూ విధానంలో భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ భవనంలోనే మండల కార్యాలయాలు కూడా కొలువుదీరనున్నాయి. కార్యాలయాల సముదాయంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుచేయనున్నారు. అలాగే, పార్కింగ్ సౌకర్యం, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా, ప్రతీ ఫ్లోర్‌లో ప్రజల కోసం వెయిటింగ్ గదులు నిర్మించేలా బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నారు.
త్వరలోనే శంకుస్థాపన
సమీకృత భవన నిర్మాణాలకు త్వరలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. గతనెల 31న కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి తరుణీ హట్‌లో ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికే అక్కడి చెట్లను తొలగించి శుభ్రం చేయించారు. అలాగే, నూతన భవనాల నిర్మాణాలకు అడ్డొచ్చే పాత భవనాల తొలగింపునకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కార్యాలయ నిర్మాణాలకు శంకుస్థాపన జరగనుందని సమాచారం. కాగా, అటు మున్సిపాలిటీ, ఇటు మండల కార్యాలయాలన్నీ ఒకే చోట నిర్మించనుండడంతో ప్రజల ఇక్కట్లు తీరనున్నాయి.
ఐదేళ్ల అనంతరం
తరుణీ హట్‌లో ఖరారు

సమీకృత భవనాలకు లైన్ క్లియర్!