ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధ, గురువారాల్లో ఖమ్మంతో పాటు రఘునాథపాలెం మండలంలో పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం 4గంటలకు రఘునాథపాలెం మండలం దోనబండలో బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే, గురువారం ఉదయం ఖమ్మం 54వ డివిజన్ వీడీఓ కాలనీలోని రెడ్‌క్రాస్ సొసైటీ భవనంలో మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్‌ను ప్రారంభించనున్న మంత్రి, ఆ తర్వాత 36వ డివిజన్‌లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
28 నుంచి అండర్–15 బ్యాడ్మింటన్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి అండర్–15 బాలబాలికల బ్యాడ్మింటన్ టోర్నీని ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి వీరభద్రరావు, వి.చంద్రశేఖర్ తెలిపారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 28నుంచి 31వ తేదీ వరకు టోర్నీ జరుగుతుందని వారు వెల్లడించారు. ఈమేరకు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కమర్తపు మురళి, కోశాధికారి జట్ల శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం వారు టోర్నీ బ్రోచర్లు ఆవిష్కరించి మాట్లాడారు. నాలుగు రోజుల పాటు జరిగే పోటీలకు రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి 200 మందికి పైగా క్రీడాకారులు హాజరుకానున్నారని తెలిపారు. ఎంట్రీల కోసం క్రీడాకారులు ఈనెల 24వ తేదీలోగా www.btronline.in లో సంప్రదించాలని సూచించారు. ప్రతీ జిల్లా జట్టులో ఐదుగురు ఆడనుండగా, సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ అంశాల్లో పోటీలు జరుగుతాయని.. ఇక్కడ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచే క్రీడాకారులను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు.
పోటీ పరీక్షలకు సిద్ధం చేయండి
ఏన్కూరు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులను నీట్, ఎప్‌సెట్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి రవిబాబు సూచించారు. ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం తనిఖీ చేసిన ఆయన అభివృద్ధి పనులు, ఉపయోగిస్తున్న సామగ్రిని పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమైన డీఐఈఓ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బోధన అందించాలని, ప్రాక్టికల్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. ఆతర్వాత లైబ్రరీ దినోత్సవం సందర్భంగా లైబ్రేరియన్ కవితను సన్మానించారు. ప్రిన్సిపాల్ సింహాచలం, అధ్యాపకులు సుందర్, కృష్ణప్రసాద్, బాబులాల్, రామారావు, వెంకటేశ్వరావు, విజయలక్ష్మి, నర్సింహారావు, రమాదేవి, కిషోర్‌బాబు పాల్గొన్నారు.
స్టేషన్‌ను కొనసాగించాల్సిందే...
చింతకాని: మండలంలోని నాగులవంచ రైల్వేస్టేషన్‌ను ఎత్తివేయకుండా కొనసాగించాలని పలువురు డిమాండ్ చేశారు. ఈమేరకు పాతర్లపాడు, నాగులవంచ రైల్వేకాలనీ, రామాపురం గ్రామాల ప్రజలు, విద్యార్థులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ప్రయాణికుల ఆదరణ లేదంటూ నాగులవంచ రైల్వేస్టేషన్‌ను మూసివేస్తున్నట్లు ఇటీవల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్ మూసివేతతో చుట్టుపక్కల పదికి పైగా గ్రామాల ప్రజలు ఇబ్బంది పడనున్నందున అధికారులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళన సందర్భంగా స్థానికులు కోరారు.