
పులిగుండాల అభివృది్ధకి రూ.4.20కోట్లు
● కిన్నెరసాని, భద్రాచలం, పులిగుండాల సందర్శనకు ప్యాకేజీ ● డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్
సత్తుపల్లిటౌన్: జిల్లాలోని పులిగుండాల అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం విభాగంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.4.20 కోట్లు మంజూరు చేసిందని జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ విక్రమ్‌సింగ్ తెలిపారు. ఇందులో మొదటి విడతగా రూ.1.89 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. సత్తుపల్లి చెక్‌పోస్టు, క్వార్టర్లు, టింబర్ డిపోను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం కంటైనర్ ఆస్పత్రి, వాచ్‌టవర్‌ను పరిశీలించాక చంద్రాయపాలెంలో వనసంరక్షణ సమితి బాధ్యులతో మాట్లాడారు. పులి గుండాల ఎకో టూరిజం, కిన్నెరసాని, భద్రాచలంను సందర్శించేలా ప్యాకేజీ రూపొందిస్తున్నట్లు తెలి పారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే టెంట్‌తో బస ఏర్పాటు చేస్తామని, పులిగుండాల వద్ద బ్యాటరీ వాహనంతో పాటు రెండు సఫారీ వాహనాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సందర్శకుల కోసం సోలార్‌బోట్ సమకూర్చడమే కాక ప్రాజెక్టు వద్ద రక్షణ కోసం ఫెన్సింగ్, 30 కి.మీ. సఫారీ రూట్, కాకతీయుల తోరణంతో గేట్, రిసెప్ష్షన్ సెంటర్ నిర్మించనున్నట్లు తెలిపారు. పులిగుండాల గుట్టపై పల్లెర్ల బావి, వీరభద్రస్వామి ఆలయం, పాలపిట్ట వాచ్ టవర్‌తో పాటు జలపాతం సందర్శకులకు ఆహ్లాదాన్ని అందిస్తాయని చెప్పారు. కాగా, గూడూరు, లోకారం, చంద్రాయపాలెం, వీఎస్‌ఎస్ సభ్యుల ఆర్థికాభివృద్ధి కోసం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయించి ఉత్పత్తులను మహిళా మార్ట్‌తో అనుసంధానం చేస్తామని డీఎఫ్‌ఓ తెలిపారు.
పోడుదారులపై చర్యలు
అడవిలో పోడు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్ హెచ్చరించారు. అటవీ సంరక్షణ, అక్రమ తవ్వకాల నివారణ, వన్యప్రాణి రక్షణ, అటవీ అభివృద్ధిపై వీఎస్‌ఎస్ సభ్యులతో చర్చించాక సూచనలు చేశారు. సత్తుపల్లి ఎఫ్‌డీఓ వి.మంజుల, టాస్క్‌ఫోర్స్ రేంజర్ శ్రీనివాసరావు, వైల్డ్‌లైఫ్ ఎక్స్‌ఫర్ట్ దీపక్‌నారాయణ పాల్గొన్నారు.