● ఖమ్మం మార్కెట్‌లో కొత్త పంట విక్రయాలు ● దిగుబడి రాక.. ధర దక్కక రైతుల ఆవేదన
ఖమ్మంవ్యవసాయం: ప్రస్తుత వానాకాలంలో సాగు చేసిన పెసర చేతికికొస్తోంది. ఈమేరకు రైతులు పంటను ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. మే నెల చివరి వారంలో కురిసిన వర్షాలకు మెట్ట పైరుగా పలువురు రైతులు పంట సాగు చేశారు. ఈ వానాకాలం పంట సాధారణ సాగు విస్తీర్ణం 16,838 ఎకరాలు కాగా 17,318 ఎకరాల్లో సాగైంది. ఖమ్మం అర్బన్, కొణిజర్ల, రఘునాథపాలెం, బోనకల్, చింతకాని, నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కామేపల్లి, మధిర, ఎర్రుపాలెం, ముదిగొండ, వైరా తదితర మండలాల్లో ఎక్కువగా సాగు చేయగా ప్రస్తుతం చేతికందుతోంది. అయితే దిగుబడి మాత్రం ఎకరాకు రెండు నుంచి రెండున్నర క్వింటాళ్లే రావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
పంటల పెట్టుబడి కోసం..
ఖమ్మం మార్కెట్‌లో ఇప్పుడిప్పుడే కొత్త పెసల విక్రయం ఊపందుకుంటోంది. జిల్లాలో ఇప్పటికే పత్తి సాగు పూర్తికాగా, వరి నాట్లు కొనసాగుతున్నాయి. మిరప సాగుకు కూడా సమయం ఆసన్నం కావడంతో ముందుగా చేతికందిన పెసలు విక్రయించి నగదును ఇతర పంటల పెట్టుబడికి వినియోగించనున్నారు. ఈమేరకు రెండు, మూడు రోజుల నుంచి ఖమ్మం మార్కెట్‌కు పది నుంచి పదిహేను క్వింటాళ్ల పెసలు తీసుకొస్తున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పెసలు క్వింటాకు మద్దతు ధర రూ.8,768గా నిర్ణయించింది. కానీ ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం గరిష్టంగా రూ.6,660, మోడల్ ధర రూ.6,350, కనిష్ట ధర రూ.5,900గా నమోదైంది. మద్దతు ధరతో పోలిస్తే రూ.2 వేలకు పైగా తేడా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం కొనుగోళ్లు లేక వ్యాపారులు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది.
దిగుబడి రాలేదు.. ధర లేదు
వర్షాధారంగా నాలుగెకరాల్లో పెసర సాగు చేస్తే ఎకరాకు రెండున్నర క్వింటాళ్ల చొప్పున పది క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. మార్కెట్‌కు తీసుకొస్తే క్వింటాకు రూ.6వేలతో తీసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తే మరో రూ.25వేలకు పైగా లభించేవి.
– కె.సైదులు, అల్లీపురం, ఖమ్మం అర్బన్ మండలం
పెసర చేతికి వచ్చేసింది!