
72 గంటలు అప్రమత్తంగా ఉండాలి
● వరద ముంచెత్తితే రంగంలోకి హెలీకాప్టర్లు ● వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న సూచనలతో అధికారులు రానున్న 72 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన పలువురు మంత్రులు, సీఎస్ రామకృష్ణారావులతో కలిసి వీసీ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బృందాలను సిద్ధం చేయడమే కాక అవసరమైన హెలీకాప్టర్లు సమకూర్చుకోవాలని తెలిపారు. గత సంవత్సరం ఖమ్మంలో ఎదురైన ఇబ్బంది ఎక్కడా పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఖమ్మం తదితర కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారులను నియమించి 24గంటలు పాటు పర్యవేక్షించాలని తెలిపారు. వీసీ అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులతో సమావేశమై వరద ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, డీఆర్‌ఓ పద్మశ్రీ, సీపీఓ ఏ.శ్రీనివాస్, ఇరిగేషన్ ఎస్‌ఈలు వెంకటేశ్వర్లు, వాసంతి, ఆర్‌డీఓ నర్సింహారావు, ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ ఈఈలు తానేశ్వర్, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు నమోదు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేస్ రికగ్నజైషన్ సిస్టమ్) ద్వారానే నమోదు చేయాలని కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి హాజరు నమోదు తదితర అంశాలపై సమీక్షించిన ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల, విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు.
అంతేకాక ఉపాధ్యాయుల డిప్యూటేషన్లపై సమీక్షించి విద్యార్థులు అధికంగా ఉన్న 237 పాఠశాలల్లో ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పారు. అలాగే, కేజీబీవీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరు, అపార్ నంబర్ల కేటాయింపు, పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థుల క్షేత్రస్థాయి సందర్శనలు, ఒక రోజు బ్యాగ్ లెస్ డే నిర్వహణపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీఈఓ నాగ పద్మజ, తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు భరోసాగా సఖి కేంద్రాలు
ఖమ్మం క్రైం: సఖి కేంద్రాల ద్వారా మహిళల హక్కులపై అవగాహన కల్పిస్తూనే అన్యాయానికి గురైన వారికి బాసటగా నిలవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ప్రభుత్వ ప్రధాన ఆప్పత్రి ప్రాంగణంలోని సఖి కేంద్రం, వన్ స్టాప్ సెంటర్, షీ టీమ్, భరోసా కేంద్రాలను తనిఖీ చేసిన ఆయన సెంటర్‌ను ఆశ్రయించిన వారి వివరాలు బాధితులకు అందించిన సాయంపై ఆరా తీశారు. ఇప్పటివరకు 2,338 మందికి సేవలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అన్యాయానికి గురైన మహిళలు హెల్ప్‌లైన్ 181 ఫోన్ చేసేలా విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్‌రెడ్డి, సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్.అరుణ, కోఆర్డినేటర్ జి.రాజకుమారి, సిబ్బంది ఈ.అంజని, టి.శ్రావణి, కె.సరిత, ఎం.సుమలత, ఎం.పుష్పలత, ఎన్.నవీన్‌కుమార్ పాల్గొన్నారు.