108, 102 వాహనాల్లో అధునాతన పరికరాలు
మధిర: అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించే 108, 102 అంబులెన్స్ వాహనాల్లో అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తెలిపారు. ఈమేరకు పరికరాల పనితీరు, వినియోగంపై మధిరలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం ఆయన ఉద్యోగులకు అవగాహన కల్పించారు. అంబులెన్స్‌ల్లో మానిటర్, వెంటిలేటర్, సిరంజ్ పంపు, ఇంక్యుబేటర్ వినియోగం, ప్రసవానంతరం నవజాత శిశువుల్లో ఏర్పడే అనారోగ్య సమస్యల నివారణకు నవజాత శిశు సంరక్షణ అంబులెన్స్ ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ అనిల్‌కుమార్, ఆస్పత్రి ఉద్యోగులు శ్రీనివాస్, మధు, శ్రీను, సీ.వీదేవి, విజయశ్రీ, శారద పాల్గొన్నారు.
స్పోర్ట్స్ స్కూళ్లలో
ప్రవేశాలకు తేదీలు ఖరారు
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రంలోని హాకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తేదీలు ప్రకటించింది. మూడంచెల్లో ఎంపిక పోటీలు నిర్వహించనుండగా, తొలుత మండల స్థాయి పోటీలు ఈనెల 6నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తారు. జిల్లాస్థాయిలో ఈనెల 27నుంచి 30వ తేదీ వరకు పోటీలు నిర్వహిస్తామని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. అలాగే, రాష్ట్రస్థాయిలో జూలై 7నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయని వెల్ల డించారు. నాలుగో తరగతిలో ప్రవేశాలు కల్పించనుండగా, ఒక్కో స్పోర్ట్స్ స్కూల్‌లో బాలురకు 20, బాలికలకు 20 సీట్లు ఉంటాయని, 8 – 9 ఏళ్ల పిల్లలు అర్హులని తెలిపారు. ఈమేరకు వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి అర్హత సాధించిన వారికి మెడికల్ టెస్ట్ అనంతరం ప్రవేశాలు కల్పిస్తారని డీవైఎస్‌ఓ వివరించారు.
మత సామరస్యాన్ని చాటుదాం..
ఖమ్మంక్రైం: బక్రీద్ పండుగ పర్వదినాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడమే కాక మత సామరస్యాన్ని చాటేలా అన్ని మతాల వారు సహకరించాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు సూచించారు. ఖమ్మంలో మంగళవారం జరిగిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టాన్ని గౌరవిస్తూ, సంప్రదాయాలను పాటించడంలో ముందు నిలిచే జిల్లా ప్రజలు ఇప్పుడు కూడా అదే తరహాలో వ్యవహరించాలని కోరారు. బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాగా, పాడి ఆవులు, లేగ దూడల క్రయవిక్రయాలు జరపొద్దని సూచించారు. మత సామరస్యానికి భంగం కలిగించేలా ఎవరైనా ప్రసంగాలు చేసినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని అదనపు డీసీపీ తెలిపారు. అనంతరం వివిధ మతాల పెద్దలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఏసీపీ రమణమూర్తి, సీఐలు కరుణకర్, బాలకృష్ణ, మోహన్ బాబు, భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు చేరిన యూనిఫామ్ క్లాత్
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫామ్ క్లాత్ జిల్లాకు చేరింది. మొదటి దశలో వచ్చిన క్లాత్‌తో యూనిఫామ్ సిద్ధం చేస్తున్నారు. రెండో విడతగా వచ్చిన క్లాత్‌ను బాధ్యులకు మంగళవారం అందజేసినట్లు ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
108, 102 వాహనాల్లో అధునాతన పరికరాలు
108, 102 వాహనాల్లో అధునాతన పరికరాలు
108, 102 వాహనాల్లో అధునాతన పరికరాలు


