రేపు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈనెల 26న జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కూసుమంచి మండలం మండలం గంగాబాద్ తండాలో వంద పడకల ఏరియా ఆస్పత్రి, కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి స్థలాలను పరిశీలిస్తారు. ఆతర్వాత క్యాంపు కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. అలాగే, సాయంత్రం 3గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సమీకృత మండల కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశాక, శ్రీరాంనగర్, సాయి గణేష్ నగర్, పోలేపల్లి డబుల్‌బెడ్‌రూమ్ వద్ద రహదారులు, డ్రెయినేజీల నిర్మానానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఎంపిక జాబితా వెబ్‌సైట్‌లో..
ఖమ్మంవైద్యవిభాగం: జాతీయ ఆరోగ్య మిషన్ విభాగం ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో నాలుగు యూపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని డీఎంహెచ్‌ఓ రామారావు తెలిపారు. ఈమేరకు ఎంపికై న అభ్యర్థుల జాబితాను https:// khammam.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపర్చామని పేర్కొన్నారు. ఈ జాబితాపై అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే ఈనెల 27వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా సరైన ఆధారాలతో తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
27న కమ్యూనిస్టు పార్టీ శతవార్షిక సభ
ఖమ్మంమయూరిసెంటర్: కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి ఈనెల 26వ తేదీతో వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 27న శత వార్షిక సభ నిర్వహిస్తున్నట్లు సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. హైదరాబాద్‌లోని సుందరయ్య భవనంలో ఈ సభ జరుగుతుందని వెల్లడించారు. త్యాగాలు, పోరాటాల వారసత్వం, విజయాలనే గుర్తుచేసుకోవడమేకాక వైఫల్యాలపై సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో బత్తిన శ్రీనివాసరావు, వి.భార్గవ, కేజీ.రామచందర్, కె.రమ, వి.కృష్ణ, జి.వెంకటేశ్వరరావు, ఎం.కృష్ణ, గుమ్మడి నర్సయ్య తదితరులు పాల్గొననున్నందున పార్టీ శ్రేణులు హాజరై విజయవతం చేయాలని రంగారావు ఓ ప్రకటనలో కోరారు.
జలవనరుల శాఖ సీఈకి ఈఎన్‌సీగా పదోన్నతి
ఖమ్మంఅర్బన్: సూర్యాపేట జిల్లా జలవనరుల శాఖ సీఈగా, ఖమ్మం ఇన్‌చార్జి సీఈగా విధులు నిర్వర్తిస్తున్న ఓ.వెంకట రమేష్‌బాబుకు పదోన్నతి లభించింది. ఆయనకు జల వనరుల శాఖలో ఈఎన్‌సీ(అడ్మిన్)గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన త్వరలోనే కొత్త బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఆయన పదోన్నతితో రెండు జిల్లాల సీఈ పోస్టులు ఖాళీ కాగా, త్వరలోనే మరో అధికారిని నియమించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
విద్యా సదస్సును
జయప్రదం చేయండి
ఖమ్మం సహకారనగర్: జనగామలో ఈనెల 28, 29వ తేదీల్లో జరగనున్న రాష్ట్ర విద్యా సదస్సు, విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో బుధవారం వారు పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. నాయకులు బుర్రి వెంకన్న, షమి, రాంబాబు, సురేష్, రామకృష్ణ, సుధాకర్, శచేంద్రబాబు, శ్రీనివాసరావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
నట్టల మందుతో జీవాలకు ఆరోగ్యం


