ఐకేపీలో నిధులు స్వాహా
● నిబంధనలకు విరుద్ధంగా నగదు ప్రోత్సాహకాలు డ్రా ● ఐకేపీ అధికారుల పాత్రపై అనుమానాలు
తిరుమలాయపాలెం: మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పని చేయాల్సిన ఇందిరాక్రాంతి పఽథం అధికారులు, సిబ్బంది మహిళా సంఘాలకు ప్రభుత్వం చెల్లించిన నగదు పోత్సాహకాలను గుట్టుచప్పుడు కాకుండా కాజేసిన వైనమిది. ఇందులో పాలుపంచుకున్న సిబ్బంది ఇప్పుడు తమకేం సంబంధం లేదని ముఖం చాటేయడంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న గ్రామదీపికలు లబోదిబోమంటున్నారు. అంతేకాక నిధుల స్వాహా విషయం బయటపడగానే రికవరీ బాధ్యతను గ్రామ దీపికలకే అప్పగించడంతో వారు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
రూ.14లక్షల్లో వాటాలు
తిరుమలాయపాలెం మండలంలోని ఏడు క్లస్టర్ల పరిధిలో 66 గ్రామ సమాఖ్యలు ఉండగా, 60 మంది వీఓఏలు పనిచేస్తున్నారు. ఈ కార్యకలాపాల నిర్వహణకు 34 మంది గ్రామ దీపికలను నియమించారు. 2017 నుండి 2022 వరకు సీ్త్రనిధి రుణాలు సక్రమంగా రికవరీ చేసిన వీఓఓలకు నగదు ప్రోత్సాహకంగా ప్రభుత్వం నుంచి రూ.20.40లక్షలు విడుదలయ్యాయి. ఇందులో 50శాతం గ్రామదీపికలు తీసుకుని మిగిలిన నిధులను గ్రామ సమాఖ్యల అభివృద్ధికి వెచ్చించాలి. అయితే, బచ్చోడు, తిరుమలాయపాలెం, పిండిప్రోలు మినహా ఇతర క్లస్టర్లలోని 19 మంది గ్రామదీపికలు రూ.14.40లక్షల నిధులను ఐకేపీ ఏపీఎం, సీసీలు, గ్రామదీపికల ద్వారా డ్రా చేయించి పంచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగస్వామ్యం ఉన్న కొందరు కొద్దినెలల క్రితం బదిలీ కావడంతో, ప్రస్తుతం గ్రామ దీపికలే తిరిగి చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిసింది. ఇందులో సీసీల పాత్ర ఉన్నా వారిని వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. ఈక్రమాన కొందరు గ్రామదీపికలు అప్పు చేసి చెల్లిస్తుండగా మరికొందరు తాము తీసుకున్న మేరకే చెల్లిస్తామని తెగేసి చెప్పినట్లు తెలిసింది. అంతేకాక ఐకేపీలోని ప్రధాన అధికారి ఒత్తిడి చేస్తుండడంతో డీఆర్‌డీఓను కలిసేందు కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా, స్వాహా పర్వాన్ని ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా బయటకు తీసిన వ్యక్తికి ఫోన్ చేసి ఒక్కో గ్రామదీపిక ద్వారా రూ.3వేల చొప్పున ఇస్తామని నచ్చచెబుతున్నట్లు తెలియగా, వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


