పెట్టుబడి కాదు భవిష్యత్‌కు పునాది
ప్రభుత్వ స్కూళ్లలో
సకల సౌకర్యాలు
ప్రభుత్వ పాఠశాలల
బలోపేతానికి చర్యలు
అధికారులు ప్రజలకు
జవాబుదారీగా ఉండాలి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క
సాక్షిప్రతినిది, ఖమ్మం: ‘రాష్ట్రాభివృద్ధిలో విద్య అంత్యంత కీలకమైంది. విద్యాశాఖపై ఖర్చు చేసే ప్రతీ రూపాయిని రాష్ట్ర భవిష్యత్‌కు ఉపయోగపడే పెట్టుబడిగా భావించాలి. అధికారులు విద్యావ్యవస్థను పటిష్టం చేయడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.’ అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. ఖమ్మం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం ఆయన విద్యాశాఖ, సంక్షేమ పథకాల అమలుతీరుపై అధికారులతో సమీక్షించారు.
ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలు పాటించాలి
ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వహణ, అనుమతుల పునరుద్ధరణపై ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ప్రభుత్వ నిబంధనలన్నీ పాటించడంతో పాటు సరైన ఆటస్థలం, ల్యాబ్‌లు, విద్యార్థుల భద్రతపై దృష్టి సారించని స్కూళ్లకు అనుమతులు పునరుద్ధరించొద్దని నిర్ణయించినట్లు చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం కల్లా విద్యాసంస్థల్లో సదుపాయాలు సమకూర్చుకోకపోతే అనుమతి విషయంలో ఇబ్బందులు తప్పవని తెలిపారు. నిబంధనలు పాటించని సంస్థలకు అనుమతి ఇస్తే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం భట్టి హెచ్చరించారు. రానున్న రెండేళ్లు అత్యంత కీలకంగా భావిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి ప్రజలు కట్టిన పన్నుల ద్వారానే వస్తున్నందున అధికారులు వారికి జవాబుదారీగా ఉండాలని చెప్పారు. కాగా, అటవీ భూ హక్కుల చట్టం కింద భూములు పొందిన గిరిజన రైతులకు ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ద్వారా ఉచితంగా సోలార్ విద్యుత్, పంపుసెట్లు, డ్రిప్, ప్లాంటేషన్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌లో సమీక్ష అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొణిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులు, ప్రిన్సిపాల్‌తో మాట్లాడి మెనూ అమలు, బోధనపై ఆరాతీశాక వంటలను తనిఖీ చేయడమే కాక విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమేకాక ఉపాధ్యాయుల నియామకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ మొదలు అధికారులంతా పర్యవేక్షించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఏదైనా ఘటన జరిగితే ఇన్‌చార్జి అధికారిని బాధ్యులుగా చేస్తామని స్పష్టం చేశారు. వచ్చేవిద్యాసంవత్సరం నాటికి మధిర నియోజకవర్గంలోని మూడు మోడల్ పాఠశాలలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణాలు, జూనియర్ కాలేజీల్లో మరమ్మతులపై కూడా సూచనలు చేశారు. ఆంగ్లం, గణితం, సైన్స్‌లో నిపుణులైన ఉపాధ్యాయులను గుర్తించి ఆన్‌లైన్ విదానంలో 8 – 10వ తరగతుల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు.


