ప్రపంచవ్యాప్తంగా విస్తరణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రపంచవ్యాప్తంగా విస్తరణకు చర్యలు

Jun 1 2025 12:12 AM | Updated on Jun 1 2025 12:12 AM

ప్రపంచవ్యాప్తంగా విస్తరణకు చర్యలు

ప్రపంచవ్యాప్తంగా విస్తరణకు చర్యలు

● లాభదాయకమైన టెక్నికల్‌ మినరల్స్‌ తవ్వే ఆలోచనలో సింగరేణి ● జీఎం కార్యాలయం, ఏరియా వర్క్‌షాప్‌ ప్రారంభోత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణి(కొత్తగూడెం): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక సింగరేణి సంస్థకు మంచి రోజులు వచ్చాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో సంస్థ పదేళ్లు వెనక్కు వెళ్లిందని, కొత్త గనులు రాకపోవడం, విస్తరణ చేపట్టకపోవడమే దీనికి కారణమని చెప్పారు. కొత్తగూడెంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన వర్క్‌షాప్‌ను, ఆ తర్వాత జీఎం కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగూడెం ఏరియాలో వీకే – 7 ఓసీకి పర్యావరణ అనుమతులు వచ్చాయని, త్వరలో రెండో దశకు అనుమతులు రానున్నాయని తెలిపారు. సింగరేణి సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేలా చర్యలు చేపడతామన్నారు. 136 సంవత్సరాల ఘన చరిత్ర గల ఈ సంస్థ కేవలం బొగ్గుపైనే ఆధారపడకుండా లాభదాయకమైన టెక్నికల్‌ మినరల్స్‌ తవ్వే ఆలోచనలో ఉన్నామని, రాబోయే 30 ఏళ్లలో మరో 22 మిలియన్‌ టన్నుల బొగ్గును అదనంగా వెలికితీసేందుకు కొత్త గనులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. సింగరేణి కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే రూ.కోటి ప్రమాద బీమా వర్తింపజేస్తున్నామని, దీంతోపాటు వారసులకు తగిన ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు.

ప్రొటోకాల్‌ పాటించలేదని ఎమ్మెల్యే ఆగ్రహం..

కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ప్రారంబోత్సవ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యేగా తన అధ్యక్షతన జరగాల్సి ఉందని, అంతేకాక ప్లెక్సీలో తన ఫొటో ముద్రించకుండా ప్రొటోకాల్‌ విస్మరించారని కూనంనేని సాంబశివరావు సింగరేణి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేను కాదని ఏ పనీ చేయొద్దని, భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కావొద్దని సూచించారు. ఇకనైనా పనితీరు మార్చుకోవాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బలరామ్‌, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్‌, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గడిపెల్లి కవిత, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నేషనల్‌ కో ఆర్డినేటర్‌ కొప్పుల రాజు, భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు, సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణరావు, కొప్పల వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌, మిరియాల రంగయ్య, కొత్తగూడెం ఏరియా జీఎం శాలేంరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement