అంతర్రాష్ట సైబర్ నేరగాళ్లు అరెస్ట్
ఖమ్మంక్రైం: ఆన్‌లైన్‌లో ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌లో డబ్బు పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి రూ.1.62కోట్లు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోనకల్ మండలానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆన్‌లైన్ ట్రేడింగ్ లాభాల పేరిట నమ్మించారు. దీంతో ఆయన రూ.1.62కోట్లు చెల్లించగా.. ఆపై ముఖం చాటారు. దీంతో సదరు వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, సీపీ సునీల్‌దత్ పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. తొలుత ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందిన షేక్ సుభానీని అదుపులోకి తీసుకుని విచారించగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన దాసరి సునీల్‌కుమార్, సుదలగుంట్ల సాయికృష్ణ కూడా ఈ మోసంలో ఉన్నట్లు తేలింది. ఈమేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణీందర్, సీఐ యాసిన్‌అలీ, ఎస్‌ఐలు రంజిత్, విజయ్‌కుమార్, సిబ్బందిని సీపీ అభినందించారు.
సన్నబియ్యం దందా మొదలు..
తిరుమలాయపాలెం: రేషన్‌షాపుల్లో దొడ్డు బియ్యంకు బదులు ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తోంది. దీంతో లబ్ధిదారులంతా బియ్యం సొంతానికి వాడుకుంటారని, తద్వారా అక్రమాలు జరగవని భావించారు. కానీ అది తప్పని తేలిపోయింది. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 13.5 క్వింటాళ్ల సన్న రేషన్ బియ్యాన్ని సోమవారం పోలీసులు గుర్తించారు. గ్రామానికి చెందిన వడ్డెబోయిన నరేష్ ఇంట్లో పిండిప్రోలుకు చెందిన వ్యాపారి మడికంటి రామయ్య బియ్యం నిల్వ చేశాడు. ఈ సమాచారంతో పోలీసులు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అయితే, సదరు వ్యాపారి బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద కొన్నాడా, డీలర్ల నుంచి సేకరించాడా తేలాల్సి ఉందని సమాచారం.
డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా
వైరా: అతి వేగంగా వెళ్తూ డివైడర్‌ను ఢీకొట్టగా కారు బోల్తా పడింది. ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్బీ.కొత్తూరుకు చెందిన మన్నెక సత్యనారాయణ, దేవప్రసాద్ కారులో సోమవారం కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. ఈక్రమాన వైరా పాత బస్టాండ్ సమీపంలో ఆదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ, దేవప్రసాద్‌కు స్వల్పంగా గాయపడడంతో స్థానికులు వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
అంతర్రాష్ట సైబర్ నేరగాళ్లు అరెస్ట్


