భద్రతకు సవాల్‌గా మారిన ఉగ్రవాదం
రఘునాథపాలెం: ఉగ్రవాదం దేశ భద్రతకు పెను సవాల్‌గా మారిన నేపథ్యాన.. అది ఏ రూపంలో ఉన్నా తుద ముట్టించాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా కవ్వింపు చర్యలకు పాల్పడడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సీపీఐ శత వసంతాల సందర్భంగా రఘునాథపాలెం మండలం ఈర్లపుడిలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించగా, ఆతర్వాత జరిగిన సభలో కూనంనేని మాట్లాడారు. దేశంలో నానాటికీ సంపన్నుల సంఖ్య పెరుగుతుండగా, బడుగు ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారుగుతోందని తెలిపారు. కనీస జీవనాధారం లేని కుటుంబాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. మతం పేరుతో కర్మ సిద్ధాంతాన్ని ప్రోత్సహించడాన్ని ఆయన తప్పుపట్టారు. కాగా, ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దాన్ని ప్రభావితం చేస్తోందని తెలిపారు. ఇక స్వాతంత్య్ర సమరం, సాయుధ తెలంగాణ పోరాటంలోనూ కీలకపాత్ర పోషించిన సీపీఐ ద్వారా ప్రజలకు హక్కులు లభించాయని, ఈ స్ఫూర్తితో ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాడుతామని కూనంనేని వెల్లడించారు. ఈ సభలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, నాయకులు దండి సురేష్, మహ్మద్ మౌలానా, జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎస్.కే.జానీమియా, శింగు నర్సింహారావు, శాఖమూరిశ్రీనివాసరావు, తాటి వెంకటేశ్వర్లు, అజ్మీరా రామ్మూర్తి, పగడాల మల్లేష్, నాయకులు వరద నర్సింహారావు, బాగం ప్రసాద్, వెంకయ్య, బానోత్ రవి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 1,654 మంది అతిథి అధ్యాపకులను కొనసాగించచడంతో పాటు పెండింగ్ వేతనాలు ఇప్పించేలా కృషి చేయాలని అతిథి అధ్యాపకురాలు సాదిన్ని రజిని తదితరులు కూనంనేనికి వినతిపత్రం అందజేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని


