రజతోత్సవ సభతో బీఆర్‌ఎస్ సత్తా చాటుతాం
ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర
సాక్షిప్రతినిధి, ఖమ్మం: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభతో పార్టీ సత్తా చాటుతామని, ఈ సభకు హాజరయ్యేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ప్రతీ జిల్లా నుంచి 30 వేల మంది రావాలని సూచించగా, ఇప్పటికే 40 వేల మంది సిద్ధమయ్యారని తెలిపారు. ఖమ్మంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ బిడ్డల ఆకాంక్ష మేరకు రాష్ట్ర ఏర్పాటు సాధనే లక్ష్యంగా కేసీఆర్ చూపిన పోరాట పఠిమ మరువరానిదని అన్నారు. అంతేకాక పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ అనేక పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కాగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలు నమ్మి ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టినా.. 16 నెలల పాలనలోనే ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. ఈ నేపథ్యాన ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించే సభలో భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు తరలివెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని వెల్లడించిన మధు, వెంకటవీరయ్య ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమవగా.. కాంగ్రెస్ నాయకులే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు నడుపుతూ తప్పుడు పద్ధతుల్లో రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, కొండబాల కోటేశ్వరరావు, బానోత్ చంద్రావతి, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో పాటు వరప్రసాద్, కర్నాటి కృష్ణ, మక్బూల్, ఉప్పల వెంకటరమణ, బెల్లం వేణుగోపాల్, భాషబోయిన వీరన్న, వేముల వీరయ్య, తాజుద్దీన్, బిచ్చాల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత పహెల్గాం మృతులకు సంతాపంగా మౌనం పాటించారు.


