సుదూరంగానే వంద శాతం..
● ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పెరిగిన ఉత్తీర్ణత ● ఎక్కడా నమోదుకాని శత శాతం ఫలితాలు ● గత ఏడాదితో పోలిస్తే మాత్రం మెరుగు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం గతంతో పోలిస్తే కాస్త మెరుగపడింది. గతేడాది ప్రథమ సంవత్సరంలో 39.06శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది 48.97శాతానికి, ద్వితీయ సంవత్సరంలో గతేడాది 60.45శాతం ఉంటే, ఈసారి 65.81శాతానికి పెరిగింది. విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు ముందుగా సమకూర్చడం, సరిపడా అధ్యాపకుల నియామకంతో పరిస్థితులో మార్పు వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
అన్నీ కాదు...
జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 4,396మంది పరీక్షలు రాయగా 2,499మంది ఉత్తీర్ణత సాధించారు. కొందరు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం విశేషం. అయితే, ఏ కాలేజీలో కూడా వంద శాతం ఫలితాలు రాలేదు. ప్రథమ సంవత్సరంలో అత్యధికంగా మధిర మండలం సిరిపురం జూనియర్ కళాశాలలో 32మంది విద్యార్థులు పరీక్ష రాయగా 23మంది(71.88శాతం) ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా కామేపల్లి జూనియర్ కళాశాల నుంచి 23మందిలో ఆరుగురే ఉత్తీర్ణులయ్యారు. బనిగండ్లపాడు కాలేజీలో 65.63శాతం, ఖమ్మం ప్రభుత్వ బాలికల కళాశాలలో 60.46, మధిర జూనియర్ కళాశాలలో 59, నేలకొండపల్లి కళాశాలలో 55.56, ఏఎస్‌ఆర్ శాంతినగర్ జూనియర్ కళాశాలలో 53.29, నాగులవంచ జూనియర్ కళాశాలలో 50శాతం ఫలితాలు సాధించగా... మిగతా కళాశాలలు 50శాతం దాటలేదు.
ద్వితీయంలో మెరుగు
ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బనిగండ్లపాడు జూనియర్ కళాశాల విద్యార్థులు 89మందికి 78మంది(87.64శాతం) ఉత్తీర్ణత సాధించారు.
ఇక కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముగ్గురికి ముగ్గురు ఫెయిల్ కావడంతో సున్నా శాతంతో ఆఖరున నిలిచింది. కామేపల్లి జూనియర్ కళాశాలలో 38.71, వైరా కళాశాలలో 47.62శాతం, పిండిప్రోలు కళాశాల 48.91శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఫలితాలు పెరిగాయి
ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాలు గతంతో పోలిస్తే పెరిగాయి. ఏటా ప్రథమ సంవత్సరం కంటే ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి నుంచే మరింత శ్రద్ధ వహిస్తూ మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేస్తాం.
– కె.రవిబాబు,
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి
సుదూరంగానే వంద శాతం..


