కల్లూరు ఇకపై మున్సిపాలిటీ
కల్లూరు: కల్లూరు మేజర్ గ్రామపంచాయతీ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. ఈమేరకు రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్న కల్లూరును మున్సిపాలిటీగా మార్చాలని ఏళ్లుగా డిమాండ్ ఉంది. కొన్నాళ్ల క్రితం కల్లూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి ఈ విషయాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి తీసుకెళ్లారు. దీంతో ప్రజలంతా అంగీకరిస్తే మున్సిపల్‌గా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం కల్లూరు మేజర్ పంచాయతీలో కల్లూరు, జీడీబీ పల్లి, ఖాన్‌ఖాన్‌పేట, శ్రీరామ్‌పురం ఉన్నాయి. ఇప్పుడు కప్పలబంధం, పుల్లయ్య బంజర్, తూర్పు లోకవరం, పడమర లోకవరం, కిష్టయ్యబంజర, హనుమాతండా, వాచ్యానాయక్ తండా గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ఆయా పంచాయతీల్లో చేసిన తీర్మానాలను ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో అసెంబ్లీలో ప్రతిపాదించగా, రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే మట్టా రాగమయికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల


