
విద్యుత్ సమస్యలపై నేడు ‘ఫోన్ ఇన్’
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సంబంధిత సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు మంగళవారం ఫోన్ ఇన్ నిర్వహిస్తున్నట్లు ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. సరఫరాలో అంతరాయాలు, ఓల్టేజీ హెచ్చుతగ్గులు, బిల్లుల సమస్యలపై వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 94408 11525 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
కోర్టు ముఖ్య పరిపాలనా అధికారి బదిలీ
ఖమ్మంలీగల్: జిల్లా కోర్టు ముఖ్య పరిపాలనాధికారి పి.హరికృష్ణ సికింద్రాబాద్ ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ కోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కరీంనగర్ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న సంజయ్ షేట్కర్‌ను ఖమ్మంకు కేటాయించారు. అలాగే, ఖమ్మం కోర్టులో పనిచేస్తున్న బి.మల్లికార్జునరావు బోధన్ ఐదో అదనపు జిల్లా కోర్టు ముఖ్య పరిపాలనాధికారిగా బదిలీ కాగా.. రంగారెడ్డి జిల్లా ప్రధాన కోర్టులో పనిచేస్తున్న పి.గోపాలకృష్ణను ఈ స్థానంలో నియమించారు.
ఆర్‌పీల నియామకానికి దరఖాస్తులు
ఖమ్మంసహకారనగర్: మండల,జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్లు (ఆర్‌పీ)లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సోమశేఖరశర్మ ఒక ప్రకటనలో సూచించారు. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను ఈ నెల 24వ తేదీలోగా తమ కార్యాలయంలో అందించాలని తెలిపారు. కలెక్టర్ ఆధ్వర్యాన కమిటీ ద్వారా రిసోర్స్ పర్సన్ల ఎంపిక ఉంటుందని వెల్లడించారు.
గాంధీపురం రైల్వేగేట్‌లో సాంకేతిక లోపం
కారేపల్లి: మండలంలోని ఖమ్మం – ఇల్లెందు ప్రధాన రహదారిపై గాంధీపురం వద్ద రైల్వేగేట్ సోమవారం సాంకేతిక లోపంతో తెరుచుకోలేదు. దీంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు గంట పాటు గేట్ మూతపడి ఉండడంతో, ఉద్యోగులు అతి కష్టంపై మరమ్మతులు చేపట్టారు. అయితే, గాంధీపురంతో పాటు, కారేపల్లిలోని ఇల్లెందు రైల్వేగేట్, పేరుపల్లి గేట్ల మీదుగా వాహనాల రద్దీ ఉంటుంది. ఇక్కడ ట్రాక్‌పై ప్రతీ 20 నిమిషాలకో గూడ్స్ వచ్చి వెళ్తుండడం.. ఆ సమయాన గేట్లు మూసివేయడం.. తరచుగా సాంకేతిక లోపంతో తెరుచుకోక వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్లైఓవర్ లేదా అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు.
20 రోజులు.. 673 మంది
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులు
ఖమ్మంక్రైం: ఈ నెలలో ఇప్పటివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 673 మంది పట్టుబడ్డారని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న 21 మంది మైనర్లపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వారు ప్రాణాలు కోల్పోవడమే కాక ఇతరులు ప్రమాదాల బారిన పడడానికి కారకులవుతారని తెలిపారు. ఈ మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన పలువురికి న్యాయమూర్తి ఒక రోజు జైలు శిక్ష లేదా జరిమానా విధించినట్లు చెప్పారు. మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సీపీ సునీల్‌దత్ వివరించారు.
25న జిల్లా జైలులో
బహిరంగ వేలం
ఖమ్మంరూరల్: జిల్లా జైలులో పనికిరాని ఇనుప వస్తువులను విక్రయించేందుకు ఈ నెల 25న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వేలం జరుగుతుందని, ఆసక్తి ఉన్న వారు రూ.5 వేల ధరావత్తు చెల్లించి పాల్గొనాలని సూచించారు. వేలంలో సామగ్రి దక్కించుకున్న వారు 18 శాతం జీఎస్టీతో కలిపి నగదు చెల్లించి వస్తువులు తీసుకెళ్లాలని తెలిపారు. వివరాలకు జైలర్లు ఎ.సక్రూనాయక్ (94946 32552), జి.లక్ష్మీనారాయణ(97005 05151)ను సంప్రదించాలని సూపరింటెండెంట్ సూచించారు.