ఐదు ఎకరాల సుబాబుల్ తోట దగ్ధం
బోనకల్: మండలంలోని రాయన్నపేట శివార్లలో ఐదెకరాల సుబాబుల్ తోట కాలిపోయింది. గ్రామానికి చెందిన బొమ్మినేని హన్మంతరావు సాగుచేస్తున్న సుబాబుల్ తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోగా, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే రూ.4 లక్షల మేర నష్టం జరిగిందని బాధిత రైతు వెల్లడించాడు.
అగ్ని ప్రమాదంలో ఫర్నిచర్..
నేలకొండపల్లి: నేలకొండపల్లికి చెందిన చింతకాయల సురేశ్ ఇంట్లో సోమవారం హీటర్ ఆన్ చేసి స్విచాఫ్ చేయడం మరిచిపోయారు. దీంతో వేడెక్కి మంటలు వ్యాపించగా వాషింగ్ మిషన్, ఫర్నిచర్ కాలిపోయాయి. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో రూ.1.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిసింది.


