సన్న బియ్యానికి సై!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసిన సన్నబియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి కనబరిచారు. ఈనెల 1 నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కాగా.. నిత్యం రేషన్ దుకాణాల వద్ద క్యూ కట్టడం కనిపించింది. జిల్లాలో 748 రేషన్ దుకాణాలు ఉండగా.. 86.27 శాతం మంది ఈనెలలో బియ్యం తీసుకున్నారు. ఆయా షాపులకు చేరిన 7,375 మెట్రిక్ టన్నుల బియ్యంలో 6,276 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ పూర్తయింది. ఇక పోర్టబిలిటీతో కలిపి 90.26 శాతం మేర సన్నబియ్యం పంపిణీ జరిగింది. గతంలో దొడ్డు బియ్యం తీసుకునేందుకు చొరవ చూపని లబ్ధిదారులు.. ఈసారి సన్నబియ్యం రావడంతో అధిక సంఖ్యలో తీసుకున్నారు. దీంతో రేషన్‌దుకాణాల్లో అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం షాపుల్లో 10 శాతం నిల్వలు మాత్రమే ఉన్నాయి.
దొడ్డు బియ్యం అంతంతే..
ప్రభుత్వం గత నెల వరకు రేషన్ దుకాణాల ద్వారా దొడ్డుబియ్యం పంపిణీ చేసింది. అయితే ఈ బియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులు అంతగా ముందుకు రాలేదు. అవి తినేందుకు అనుకూలంగా లేకపోవడంతో తక్కువ మంది మాత్రమే తీసుకెళ్లే వారు. వారిలోనూ కొందరు పిండి పట్టించడం లేదా ఇతరులకు అమ్మడం వంటివి చేసేవారు. కొందరు రేషన్‌కార్డుదారులైతే ఏళ్ల తరబడి షాపులకు రావడమే మానేశారు. దీంతో పేదల ఆకలి తీర్చాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. బియ్యం నిల్వలు పెరగడంతో అక్రమ రవాణాకు దారితీసేవి. కొందరు లబ్ధిదారులు బియ్యానికి బదులు డీలర్ల వద్ద డబ్బు తీసుకోవడంతో పేదల బియ్యం పక్కదారి పట్టాయి. అనేక చోట్ల ఇతర ప్రాంతాలకు లారీల్లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్న ఘటనలు కోకొల్లలు.
మొదటి రోజు నుంచే ఆసక్తి..
ఈనెల 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. గతంలో రేషన్ పంపిణీ ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాతే లబ్ధిదారులు బియ్యం తీసుకునేవారు. అయితే సన్నబియ్యం ఎలా ఉన్నాయో చూడాలనే ఉద్దేశంతో మొదటి రోజు నుంచే తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపారు. ఆ బియ్యాన్ని వండిన వారు భోజనం బాగుందని చెప్పడంతో మిగిలిన వారు సైతం దుకాణాల బాట పట్టారు.
86 శాతం అమ్మకాలు..
జల్లాలోని 748 రేషన్ దుకాణాల్లో బియ్యం అమ్మకాలు పూర్తయ్యాయి. జిల్లాలో 4,10,988 రేషన్‌కార్డులు ఉండగా.. 3,54,573 కార్డుల వారు బియ్యం తీసుకున్నారు. మొత్తంగా 86.27 శాతం అంటే 6,276 మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు చేరాయి. ఇక పోర్టబిలిటీతో కలిపి 90.26 శాతం అయింది. గతంలో 70 శాతం వరకు మాత్రమే బియ్యం పంపిణీ జరిగేది. 30 నుంచి 40 శాతం బియ్యం నిల్వలు ఉండేవి. అయితే ఈసారి కేవలం 10 శాతం మాత్రమే నిల్వలు ఉండటం గమనార్హం. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో 1099.785 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ ఉంది. ఇవి కూడా మృతిచెందిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి సంబంధించనవేనని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో నిల్వలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం దాదాపు అందరూ బియ్యం తీసుకున్నారు.
ఈనెల 1 నుంచి
రేషన్ దుకాణాల్లో పంపిణీ
బియ్యం తీసుకునేందుకు
ఆసక్తి చూపిన లబ్ధిదారులు
జిల్లాలో 86 శాతం మందికి సరఫరా
పోర్టబిలిటీతో కలిపి 90 శాతం వరకు అమ్మకాలు
గ్రామాల్లో షాపుల వద్ద క్యూ కడుతున్న కార్డుదారులు
అంతటా సన్నబియ్యమే..
గతేడాది వానాకాలం నుంచి రైతులు సన్నరకం ధాన్యం పండించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సన్న ధాన్యం పండించిన వారికి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించడంతో అత్యధిక విస్తీర్ణంలో ఈ పంటలు సాగయ్యాయి. దీంతో వసతిగృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంతో పాటు రేషన్ దుకాణాల్లోనూ సన్న బియ్యం పంపిణీ చేయడానికి అవకాశం లభించింది. ముందుగానే ఏడాదికి సరిపడా నిల్వలు సేకరించిన ప్రభుత్వం.. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీకి రంగం సిద్ధం చేసింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ సన్నబియ్యాన్నే వినియోగిస్తున్నారు. అటు రైతులకు బోనస్‌తో పాటు ఇటు లబ్ధిదారులకు సన్నబియ్యం అందుతున్నాయి. ప్రస్తుత యాసంగిలోనూ ఎక్కువ మంది రైతులు సన్న ధాన్యాన్నే సాగు చేయగా రేషన్ దుకాణాల్లో ఈ బియ్యం పంపిణీ కొనసాగనుంది.
సన్న బియ్యానికి సై!


