హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను http:// telanganams.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా సోమవారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ సూచించారు. ఆరో తరగతి విద్యార్థులకు ఈనెల 27న ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, 7–10వ తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు
ఖమ్మం రాపర్తినగర్: జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకొవాలని జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి ఎన్.మాధవి ఒక ప్రకటనలో సూచించారు. జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి 21–38 ఏళ్ల వయస్సు ఉండాలని, కనీసం మూడేళ్ల పాటు ఆనుభవం కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఈమేరకు దరఖాస్తులను 25వ తేదీలోగా germanytriplewin2025@gmail.com మెయిల్‌కు పంపించాలని, వివరాలకు 94400 51581, 94400 48500, 94400 52081 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభం
ఖమ్మం సహకారనగర్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యా యి. తొలిరోజు పదో తరగతి పరీక్షలకు 488 మందికి గాను 420 మంది హాజరు కాగా 68 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్ష కు 646 మందికి గాను 575 మంది హాజరు కాగా, 71మంది గైర్హాజరయ్యారని డీఈఓ సోమశేఖర శర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా మద్దినేని పాపారావు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని వారు పేర్కొన్నారు. కాగా డీఈఓతో పాటు డీఐఈఓ రవిబాబు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
25న ఉద్యోగుల సదస్సు
టీజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి
ఖమ్మం సహకారనగర్ : జిల్లా తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) ఆధ్వర్యంలో ఈనెల 25న ఉద్యోగుల సదస్సు నిర్వహిస్తున్నామని, దాన్ని విజయవంతం చేయాలని టీజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నగరంలోని టీఎన్జీవోస్ భవన్‌లో ఆదివారం సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్‌లో సదస్సు ఉంటుందని, 4 గంటలకు కలెక్టరేట్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సదస్సుకు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తదితరులు హాజరవుతారని తెలిపారు కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, కన్వీనర్ కస్తాల సత్యనారాయణ, నాయకులు యలమద్ది వెంకటేశ్వర్లు, పారుపల్లి నాగేశ్వరరావు, తుంబూరు సునీల్‌రెడ్డి, విజయ్, వీరస్వామి, కొణిదన శ్రీనివాస్, మోదుగు వేలాద్రి తదితరులు పాల్గొన్నారు.
‘భూ భారతి’పై
అవగాహన కల్పించాలి
నేలకొండపల్లి : భూ భారతి చట్టంపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ (రెవె న్యూ) పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. మండలంలోని రాయగూడెం, బోదులబండ గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన గ్రామ సభలను ఆయనతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి పరిశీలించారు. రిజిస్టర్ల నమోదును తనిఖీ చేసి, ఏ సమస్యలపై ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని ఆరా తీశారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు తమ భూముల విషయంలో జవాబుదారీతనాన్ని పెంచేందుకే ఈ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ ఇమ్రాన్, ఆర్‌ఐలు ఆలస్యం మధుసూదన్‌రావు, అల్లం రవి, నాయకులు బోయిన వేణు, సూరేపల్లి రామారావు, తీగ రమణయ్య, పతానాపు నాగయ్య పాల్గొన్నారు.
వల్లభిలో చెక్‌పోస్ట్ తనిఖీ..
ముదిగొండ : మండల పరిదిలోని వల్లభి చెక్ పోస్ట్‌ను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదివా రం తనిఖీ చేశారు. తెలంగాణ–ఏపీ సరిహద్దులో చెక్ పోస్టు ఉండగా, రికార్డులు పరిశీలించి, విధుల్లో ఉన్న వారి వివరాలు సేకరించారు. చెక్ పోస్ట్ వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. మార్కెట్ వివరాలు సక్రమంగా రికార్డులో నమోదు చేయాలని, నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.


