నిప్పురవ్వ.. కార్చిచ్చు కాకుండా
● ప్రమాదాల నివారణ, రక్షణపై ప్రజలకు అవగాహన ● కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు ● రూ.లక్షల్లో డీజిల్ బకాయిలతో ఉద్యోగుల సతమతం
సత్తుపల్లిటౌన్: అసలే ఎండాకాలం.. ఆపై వడగాలులు తోడవుతున్నాయి. ఈ నేపథ్యాన అగ్గిరవ్వ రాజుకుంటే చాలు మంటలు చెలరేగే ప్రమాదముంది. ఈనేపథ్యాన అగ్నిప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవడం, ప్రమాదాలు ఎదురైతే రక్షించుకునేలా ఏటా ఏప్రిల్ 14నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వారోత్సవాలు కొనసాగుతుండడంతో జిల్లాలో శాఖ అధికారులు మాక్‌డ్రిల్‌ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
అప్రమత్తత తప్పనిసరి
సహజంగా ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈనేపథ్యాన ప్రజలు అప్రమత్తంగా లేకపోతే రూ.లక్షల్లో ఆస్తినష్టం ఎదురవుతుంది. ఊరేగింపులు, వివిధ కార్యక్రమాల సందర్భంగా కాల్చే టపాసులు గడ్డివాములు, ఇళ్లపై పడితే ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆస్తినష్టమే కాదు ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు ఎదురవుతుంది. ఈనేపథ్యాన ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించడం, ప్రమాదాలు ఎదురైనప్పుడు కాపాడుకునేలా అగ్నిమాపక శాఖ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో...
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా, కూసుమంచి, ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట, మణుగూరుల్లో ఫైర్ స్టేషన్లు ఉండగా నేలకొండపల్లిలో ఔట్ పోస్టు కొనసాగుతోంది. వీటికి తోడు కల్లూరులో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు.
గల్లీల్లోకీ వెళ్లేలా..
ఇరుకు గల్లీల్లోకి ఫైరింజన్ వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోంది. అలాంటి ప్రాంతాల్లో అగ్నిప్రమాదం జరిగితే మంటలు అదుపు చేసేలా బుల్లెట్ వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. ఇందులో రెండు సిలిండర్లలో 20 లీటర్ల నీరు ఉంటుంది. అలాగే, ఫోమ్‌ను చల్లడం ద్వారా వంద మీటర్లు వెడల్పులో వ్యాపించిన మంటలను సైతం ఆర్చవచ్చు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు
అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తపై శాఖల అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. వంటగదిలో డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటివి ఉంచకపోవడమే మంచిది. అలాగే, దూరప్రాంతాలకు వెళ్లే సమయాన విద్యుత్‌లైట్లు, మెయిన్ వద్ద సరఫరా నిలిపివేయాలి. ఇంటికి అన్ని వైపుల గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. పూజామందిరం వద్ద దీపం వెలిగించి బయటకు వెళ్లొద్దు. వంట పూర్తికాగానే సిలిండర్ రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి. చిన్నపిల్లలకు అగ్నిపెట్టెలు, లైటర్లు, టపాసులు వంటివి ఇవ్వొద్దు. ఐఎస్‌ఐ మార్కు ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులను మాత్రమే వినియోగించాలి. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగితే ఆర్పడానికి నీరు అందుబాటులో ఉంచుకోవాలి. దుస్తులకు నిప్పు అంటుకుంటే పరిగెత్తకుండా నేలపై దొర్లడం లేదా దుప్పటి చుట్టుకుంటే ఫలితం ఉంటుంది. ఇక భవనాల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు అత్యవసర ద్వారాలను గుర్తించి బయటకు వెళ్లాలి. మంటలను ఆర్పే ఉపకరణాలు కనిపిస్తే వినియోగించుకోవాలి. పొగ ముసురుకుంటే ముఖానికి తడివస్త్రం అడ్డుపెట్టుకుని బయటకు రావాలి.
జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల సమాచారం
అగ్నిమాపక కేంద్రం ఫోన్ నెంబర్
ఖమ్మం 87126 99280
సత్తుపల్లి 87126 99282
మధిర 87126 99284
వైరా 87126 99288
కూసుమంచి 87126 99286
నేలకొండపల్లి 87126 99290
వాహనం కదిలేది ఎలా?
జిల్లాలో తరచూ ఎక్కడో ఓ చోట అగ్నిప్రమాదం జరుగుతోంది. ఈ సమాచారం అందగానే అగ్నిమాపక శాఖ సిబ్బంది వాహనంతో సహా వెల్లాలి. కానీ నెలల తరబడి డీజిల్ బిల్లులు ప్రభుత్వం నుంచి రాకపోవడం అధికారులకు తలనొప్పిలా మారింది. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగిందని తెలిస్తే ఉద్యోగులే వాహనంలో డీజిల్ పోయించుకుని వెళ్లాల్సి వస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఫైర్ స్టేషన్లకు డీజిల్ బిల్లులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని ఉద్యోగులు వాపోతున్నారు.
నిర్లక్ష్యం వహించొద్దు..
వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాద తీవ్రత పెరుగుతుంది. ఇళ్లలో వంట చేసే సమయంలో మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ వినియోగంలోనూ ఏమరుపాటుగా ఉండొద్దు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
– వై.వెంకటేశ్వరరావు, ఫైర్ ఆఫీసర్, సత్తుపల్లి
నిప్పురవ్వ.. కార్చిచ్చు కాకుండా
నిప్పురవ్వ.. కార్చిచ్చు కాకుండా


