డెయిరీలో పారదర్శకతే కీలకం
మధిర: మధిర నియోజకవర్గంలో ఏర్పాటుచేస్తున్న ఇందిరా కోఆపరేటివ్ డెయిరీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున.. లబ్ధిదారులకు గేదెల కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో శుక్రవారం ఆయన ఇందిరా డెయిరీ, చెరువులు, పర్యాటక రంగ అభివృద్ధి పనులతో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఇందిరా డెయిరీలో గేదెల కొనుగోలు కీలకమైనందున, అదనపు కలెక్టర్, డీఆర్‌డీఓ పర్యవేక్షణలో పూర్తిచేయాలని తెలిపారు. గేదెలు ఎక్కడ, ఏవి కొనుగోలు చేయాలనేది లబ్ధిదారులకు ఇష్టం మేరకు చేపట్టాలని, ఏ చిన్న పొరపాటు జరిగినా అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కాగా, 20వేల మంది వాటాదారులు, 40వేల గేదెలతో డెయిరీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో గడ్డి పెంపకం, స్థలాల గుర్తింపు, గేదెల బీమా, పాల సేకరణ, మార్కెటింగ్‌పై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం ముల్క నూరు, విజయ డెయిరీల సందర్శనకు దశలవారీగా తీసుకువెళ్లాలని భట్టి ఆదేశించారు. అలాగే, డెయిరీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి ఉద్యోగులను కేటాయించాలని సూచించారు. కాగా, గేదెలకు ఆరోగ్య పరీక్షలు, చికిత్స కోసంప్రతీ మండలానికి రెండు పశువైద్య అంబులెన్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
చెరువులు, పర్యాటక అభివృద్ధికి కార్యాచరణ
మధిర, జమలాపురం చెరువులను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అనుమతులు వచ్చినందున వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం నీటిపారుదల, పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ చెరువుల పరిధిలో నిర్మించే కాటేజీలు, మినీ హట్స్‌తో పాటు బోట్ల డిజైన్లను ఆయన సీఎం పరిశీలించారు. అలాగే, మాటూరు, బయ్యారం, కలకోట, చిరుమర్రి, ముత్తారం, చింతకాని చెరువుల అభివృద్ధిపై కూడా సూచనలు చేశారు. సమావేశంలో డీఆర్‌డీఓ సన్యాసయ్య, సెర్ప్ ఉద్యోగి సరిత, జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ రమేష్‌బాబు, ఈఈ రామకృష్ణ, సెర్ప్ డైరెక్టర్ రంజిత తదితరులు పాల్గొన్నారు.
ఇందిరా డెయిరీ పర్యవేక్షణ బాధ్యత అదనపు కలెక్టర్‌కు...
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క


