భూసేకరణలో ముందడుగు
● మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణంలో పురోగతి ● నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇచ్చేలా నిర్ణయం ● 80శాతానికి పైగా నిర్వాసితుల అంగీకారం
ఖమ్మంఅర్బన్: మున్నేరు నది ముంపు నుంచి పరీవాహక ప్రాంత ప్రజలను రక్షించేందుకు గాను ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఇందుకు అడ్డంకిగా మారిన ప్రైవేట్ భూముల సమస్యకు పరిష్కార మార్గం లభించినట్లు తెలిసింది. ఖమ్మం నియోజకవర్గంతో పాటు పాలేరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు, కాలనీలు మున్నేటి వరద ప్రవాహంతో ఏటా ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఇళ్లు మునిగిపోతుండగా, బాధితులు సర్వం కోల్పోతున్నారు. గత ఏడాది అసాధారణ రీతిలో వరద రావడంతో రూ.కోట్లలో నష్టం నమోదైంది. దీంతో సమస్య శాశ్వత పరిష్కారానికి గాను ప్రభుత్వం మున్నేటికి ఇరువైపులా 16 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి రూ.690 కోట్లు కేటాయించింది. అయితే, ప్రభుత్వ భూమిలో నిర్మాణ పనులు కొద్దినెలలుగా జరుగుతున్నప్పటికీ ప్రైవేట్ స్థలాలు, ఇళ్లు, వ్యవసాయ భూముల విషయమై పరిహారం తేలకపోవడంతో జాప్యం జరిగింది. కాగా, పలుమార్లు మంత్రులు, కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ, జలవనరులశాఖ అధికారులు నిర్వాసితులతో చర్చించి వరదతో ఎదురయ్యే నష్టాన్ని వివరించగా.. భూములు ఇచ్చేందుకు వారు అంగీకరించినట్లు సమాచారం.
పోలేపల్లి వద్ద లే ఔట్
మున్నేరు పరీవాహకంలో ఇళ్లు, స్థలాలు, పొలాలు ఉన్న వారు తమ భూములను రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అప్పగిస్తే పోలేపల్లిలో డీటీసీ లేఔట్ చేసి స్థలాలు కేటాయించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు ఒప్పించినట్లు సమాచారం. ఈమేరకు నిర్వాసితులు 80శాతం మందికి పైగా తమ భూములు, ప్లాట్లు ఇవ్వడానికి అంగీకారపత్రాలు అందజేసినట్లు తెలిసింది. అయితే, ఇంటి స్థలం కోల్పోతే అంతే స్థలాన్ని పోలేపల్లి వద్ద చేసే లే ఔట్‌లో కేటాయిస్తారు. అలాగే, భూములు కోల్పోతే ఎకరాకు 600 – 750 గజాల స్థలం ఇచ్చేలా నిర్ణయించినట్లు సమాచారం. ఏటా ముంపు భయంతో ఉండేబదులు మున్నేటికి దూరంగా లే ఔట్ చేసే స్థలంలో ఉంటే మంచిదనే భావనతో పరీవాహక ప్రాంత ప్రజలు ముందుకొచ్చినట్లు తెలుస్తుండగా.. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మార్గం సుగమైనట్లేనని భావిస్తున్నారు.
మార్కింగ్ కూడా...
రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సేకరించాల్సిన భూమిని పలు దఫాలుగా పరిశీలించిన వివిధ శాఖల అధికారులు మార్కింగ్ కూడా చేశారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని మల్లెమడుగు, దానవాయిగూడెం, బురాన్‌పురం, ఖమ్మం రెవెన్యూ పరిధిలో వ్యవసాయ భూములు, వెంచర్లు, ప్లాట్లు, ఇండ్లు కలిపి మొత్తం సుమారు 67ఎకరాలు సేకరించనున్నట్లు తెలిసింది. ఇందులో 28 ఎకరాల పరిధిలో ప్లాట్లు ఉన్నాయి. ఇక పాలేరు నియోజకవర్గ పరిధి పోలేపల్లి, ఏదులాపురం, రెడ్డిపల్లి, గుదిమళ్ల తదితర ప్రాంతాల్లో సుమారు 74ఎకరాలకు పైగా స్థలాన్ని గుర్తించారు. ఇప్పటికే నిర్వాసితులకు నోటీసులు ఇవ్వడమే కాక వారి నుంచి అంగీకారపత్రాలు సైతం తీసుకుంటున్నారు. ఈమేరకు 80శాతానికి పైగా మంది అంగీకార పత్రాలు అందించినట్లు రెవెన్యూ అధికారుల ద్వారా తెలిసింది. అయితే, బొక్కలగడ్డ, మోతీనగర్ ప్రాంతాల బాధితులు మాత్రం తమ ఇంటి స్థలం కేటాయించడమే కాక ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఇంకా స్పష్టత రాకున్నా అత్యధిక శాతం మంది భూములు, స్థలాలు ఇవ్వడానికి అంగీరించిన నేపథ్యాన మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఇక్కట్లు తొలగినట్లేనని యంత్రాంగం చెబుతోంది.


