
పన్నుల వసూళ్లలో జాప్యం వద్దు
వైరా: ఈనెలాఖరు నాటికి వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందేనని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ రీజినల్ డైరెక్టర్ షాహీద్ మసూద్ స్పష్టం చేశారు. వైరా మున్సిపాలిటీలో పన్ను వసూళ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పన్నులు వసూలు చేయాలని సూచించారు. మార్చి 31వరకు సెలవులు కూడా ఉండవని తెలిపారు. నిర్దేశిత లక్ష్యం కంటే తక్కువ వసూలైతే బాధ్యులపై చర్యలు తప్పవని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ చింతా వేణు, ఆర్‌ఐ ప్రదీప్, ఉద్యోగులు పాల్గొన్నారు.
984మంది విద్యార్థులకు కంటి అద్దాలు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో ఉంటున్న 984 మంది విద్యార్థులకు మొదటి విడతగా కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.కళావతిబాయి తెలిపారు. ఇటీవల 3,557 విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించగా 3,079 మందికి అద్దాలు అవసరమని తేల్చినట్లు పేర్కొన్నారు. ఇందులో మొదటి విడతగా 984 మందికి కంటి అద్దాలను పాఠశాలలు, హాస్టళ్లకు పంపినట్లు ఆమె తెలిపారు.
విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ లైన్లు
ఖమ్మంఅర్బన్: రానున్న వేసవిలో డిమాండ్ పెరగనున్నందున విద్యుత్ సరఫరాలో అంతరాయం ఎదురుకాకుండా సబ్ స్టేషన్లుకు ప్రత్యామ్నాయ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఐ.శ్రీనివాసాచారి తెలిపారు. ఖమ్మం ఖానాపురం పారిశ్రామిక ప్రాంతానికి మెరుగైన సరఫరా కోసం రూ.25లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన 33 కేవీ లైన్‌ను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ లైన్‌తో బల్లేపల్లి సెక్షన్ పరిధి ఖానాపురం, బల్లేపల్లి, పాండురంగాపురం, బాలపేట, జయనగర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో మెరుగైన సరఫరా చేయొచ్చని తెలిపారు. డీఈ ఎన్.రామారావుతో పాటు ఉద్యోగులు ఎం.సంజీవ కుమార్, పి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన ఓటర్ జాబితా సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జిల్లాలో ఓటర్ జాబితా సవరణ పకడ్బందీగా జరిగేలా ఉద్యోగులు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ విషయంలో పార్టీల నాయకులు సహకరించాలని చెప్పారు. ఫారం–6 ద్వారా 4,734 దరఖాస్తులు రాగా 3,267 మందికి కొత్తగా ఓటు హక్కు కల్పించామని తెలిపారు. అలాగే, ఫారం–7 ద్వారా అందిన 3,352 దరఖాస్తుల్లో 2,450 పరిష్కరించగా, ఫారం–8 దరఖాస్తులు 11,820లో 9,573 పరిష్కారమయ్యాయని చెప్పారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు ఇప్పటికీ వ్యయ వివరాలు అందజేయలేదని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈసమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీహెచ్.స్వామి, డీటీ అన్సారీతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షల్లో
ఇద్దరి డీబార్
ఖమ్మం సహకారనగర్: ఇంటర్‌మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులను డీబార్ చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు. బోర్డు అబ్జర్వర్లు టి.యాదగిరి, ఆర్.వెంకటేశ్వర్లు మంగళవారం పలు కేంద్రాల్లో తనిఖీ చేయగా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఇద్దరు పట్టుబడ్డారని పేర్కొన్నారు. కాగా, మంగళవారం పరీక్షలకు 17,442మందిలో 17,001మంది విద్యార్థులు హాజరయ్యారని డీఐఈఓ తెలిపారు.

పన్నుల వసూళ్లలో జాప్యం వద్దు