మళ్లీ తెరపైకి గొర్రెల పథకం అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి గొర్రెల పథకం అక్రమాలు

Mar 18 2025 12:40 AM | Updated on Mar 18 2025 12:39 AM

● ఇటీవల రికార్డులతో పాటు క్షేత్రస్థాయిలో విజిలెన్స్‌ తనిఖీలు ● తాజాగా వరంగల్‌లో పశువైద్యాధికారుల విచారణ

ఖమ్మంవ్యవసాయం: గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు వరంగల్‌ నుంచి వచ్చిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి చెందిన ముగ్గురు అధికారుల బృందం రెండు రోజుల పాటు తనిఖీలు, క్షేత్ర స్థాయి విచారణ చేపట్టింది. ఈసందర్భంగా ఖమ్మంలోని జిల్లా పశువైద్య, పశుసంవర్దక శాఖ కార్యాలయంలో 2017–18 నాటి గొర్రెల పథకం తాలుకా రికార్డులు, బిల్లులు, బీమా వివరాలను పరిశీలించడమే కాక మధిర, ఎర్రుపాలెం మండలాల్లో పర్యటించింది. తాజాగా సోమవారం జిల్లాలోని ఐదుగురు పశువైద్యాధికారులను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు సోమవారం వరంగల్‌కు పిలిపించి విచారణ నిర్వహించారు.

ఏమిటీ పథకం?

గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పెంపకందారుల ఆర్థిక పరిపుష్టి కోసం 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని రెండు విడతలుగా అమలు చేసింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా రూ.కోట్లలో అక్రమాలు జరిగాయని ‘కాగ్‌’ గుర్తించగా, నివేదిక ఆధారంగా అప్పట్లోనే పలు జిల్లాల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో ఓ ఉన్నత స్థాయి అధికారిని అరెస్ట్‌ చేయగా, ఇంకొందరిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈనేపథ్యాన ఖమ్మం జిల్లాలోనూ అక్రమాలు జరిగాయంటూ బాధ్యులుగా పలువురికి నోటీసులు ఇచ్చారు.

అక్రమాలు ఇలా..

గొర్రెల పంపిణీ పథకంలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.25 లక్షల విలువైన యూనిట్‌(21గొర్రెలు) ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో 32,513 మందిని అర్హులుగా గుర్తించి 2017–18లో 10,538 మందికి గొర్రెలు అందించారు. ఈ మొత్తంలో 970 యూనిట్లకు సంబంధించి అక్రమాలు జరిగాయని కాగ్‌ నివేదికలో పేర్కొంది. ఒక్కో యూనిట్‌ రవాణాకు రూ.6వేలు చెల్లించాలని నిర్ణయించడంతో జిల్లా లబ్ధిదారులకు ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల నుంచి గొర్రెలను తెప్పించారు. అయితే, రవాణా కాంట్రాక్టర్లు ఇచ్చిన బిల్లుల ఆధారంగా పశుసంవర్ధ శాఖ నగదు చెల్లించింది. కానీ కాంట్రాక్టర్లు సమర్పించిన వాహనాల నంబర్లను పరిశీలించగా అంబులెన్స్‌లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఉండడం, 106 చోట్ల అంకెల మార్పిడి జరగడంతో రూ.17కోట్లు దుర్వినియోగం జరిగి నట్లు తేల్చారు. ఇందులో కాంట్రాక్టర్లతో పాటు 27 మంది పశువైద్య అధికారుల బాధ్యత ఉందని చెబుతూ వివరణ తీసుకున్నారు. అయితే, ఈ కేసు ఇన్నాళ్లు మూలనపడగా మరోసారి విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని ఆదేశించింది. దీంతో అక్రమాల వ్యవహారం తెరపైకి రావడం, ముమ్మరంగా విచారణ జరుగుతుండగా.. విజిలెన్స్‌ విభాగం అధికారులు త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఎవరిపై వేటు పడుతుందోనని పశు సంవర్థక శాఖ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement