● రూ.2.35కోట్ల వరకు కొనసాగిన పాట ● ప్రభుత్వ మద్దతు ధర రాక వాయిదా
కామేపల్లి: రాష్ట్రంలోనే పేరున్న మండలంలోని కొమ్మినేపల్లి(పండితాపురం) గ్రామపంచాయతీ పరిధి శ్రీ కృష్ణప్రసాద్ సంత నిర్వహణను అప్పగించేందుకు నిర్వహించిన వేలంలో ప్రభుత్వ మద్దతు ధర రాకపోవడంతో పాటను రద్దు చేశారు. జీపీ ప్రత్యేకాధికారి, ఎంపీడీఓ రవీందర్ అధ్యక్షతన గురువారం వేలం పాట నిర్వహించగా బోడా శ్రీను, భూక్యా వీరన్న, బానోత్ శంకర్, భూక్యా నాగేంద్రబాబు ధరావత్తు, సాల్వెన్సీగా రూ.35లక్షల చొప్పున చెల్లించారు. సాయంత్రం 4గంటల వరకు హోరాహోరీగా సాగిన వేలంలో చివరకు రూ.2,35,70,000తో హెచ్చు పాటదారుడిగా బోడా శ్రీను నిలిచాడు. అయితే, ప్రభుత్వ మద్దతు రాకపోవడంతో రద్దు చేసిన అధికారులు తిరిగి ఈనెల 17న మరోమారు వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు మొదటి, రెండు స్థానాల్లో ఉన్న బోడా శ్రీను, భూక్యా వీరన్న చెల్లించిన ధరావత్తు, సాల్వెన్సీ సొమ్మును జీపీ అధికారులు ఆధీనంలోకి తీసుకోగా, మిగతా వారి నగదు చెల్లించారు. అయితే, ప్రభుత్వ మద్దతు ధర ఎంత అనేది మాత్రం బయటపెట్టలేదు. వేలం పాటను జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, డీఎల్‌పీఓ రాంబాబు పర్యవేక్షించగా ఎస్సై సాయికుమార్ ఆధ్వర్యాన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీఓలు ప్రభాకర్‌రెడ్డి, సత్యనారాయణ, కార్యదర్శి శంకర్ పాల్గొన్నారు.