● మిగిలిన టన్నెల్ పనులు 681 మీటర్లే.. ● కాల్వల్లో ఇప్పటికే గోదావరి పరవళ్లు ● అధికారులతో నేడు మంత్రి తుమ్మల సమీక్ష
సత్తుపల్లి: యాతాలకుంట టన్నెల్ నిర్మాణ పనులు ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంటున్నాయి. 1,781 మీటర్ల పనులకు గాను 1,100 మీటర్ల మేర పూర్తయ్యాయి. ఇంకా 681 మీటర్ల పని మిగిలి ఉంది. భూ నిర్వాసితులకు రూ.15 కోట్లు చెల్లించడంతో రైతుల నుంచి అడ్డంకులు తొలిగిపోగా.. పనుల్లో వేగం పుంజుకుంది. రోజుకు నాలుగు షిఫ్టుల్లో 24 గంటలూ పనులు చేపడుతున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా సత్తుపల్లి ట్రంక్ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బుగ్గపాడు వద్ద కాల్వల నిర్మాణ పనులకు కొంత ఆటంకం ఏర్పడినా ఇటీవలే రైతులకు పరిహారం చెల్లించడంతో ఆ సమస్య పరిష్కారం అయింది.
కమలాపురం పంప్‌హౌస్ నుంచి..
యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తయితే కమలాపురం పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలు దమ్మపేట మండలం మల్లెపూల వాగు మీదుగా బేతుపల్లి పెద్దచెరువుకు చేరుకుంటాయి. అక్కడి నుంచి బేతుపల్లి ప్రత్యామ్నాయ కాల్వ ద్వారా వేంసూరు, సత్తుపల్లి మండలాల్లోని పొలాలకు గోదావరి జలాలు చేరుకుంటాయి. అయితే సీతారామ ప్రాజెక్టు కింద రూ.29 కోట్లతో అంతర్గతంగా కాల్వల నిర్మాణానికి భూమి సేకరిస్తున్నారు. దీంతో చివరి పొలాలకు కూడా సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తారు.
రాజీవ్ లింక్ కెనాల్‌తో..
సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేలా కాల్వలు డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే జూలూరుపాడు మండలం వినోభానగర్‌లోని రాజీవ్ లింక్ కెనాల్ నుంచి ఏన్కూరు వద్ద ఎన్నెస్పీ కెనాల్‌కు అనుసంధానం చేయగా తల్లాడ, పెనుబల్లి, కల్లూరు, వేంసూరు మండలాలకు గోదావరి జలాలు అందుతున్నాయి. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
టన్నెల్ నిర్మాణం భద్రమే..
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంతో యాతాలకుంట టన్నెల్ పనులపై అధికారులు పలుమార్లు సమీక్షలు చేసి నిర్మాణ పనులు భద్రమేనని నిర్ధారించుకున్నారు. 5.25 మీటర్ల వెడల్పు గల టన్నెల్ నిర్మిస్తున్నారు. టన్నెల్ తవ్వేప్పుడు వస్తున్న నీటిని ఆరు మోటార్లతో బయటకు తోడుతున్నారు. ప్రతీ మూడు నెలలకోసారి జియాలజిస్ట్ బృందం తనిఖీ చేసి సొరంగం లోపల భూమి పరీక్షలు నిర్వహించి సూచనలు చేస్తోంది.
నేడు మంత్రి సమీక్ష..
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి యాతాలకుంట టన్నెల్ పనులను గురువారం పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే సత్తుపల్లి పట్టణానికి తాగునీరు, పరిసర ప్రాంతాల్లో సాగునీటి ఇబ్బందులు తీరే అవకాశం ఉంటుంది.