● చతుఃస్థానార్చన హోమంతో మొదలు ● నదీ, సముద్ర జలాలతో పూజలు ● ముఖ్య అతిథిగా హాజరు కానున్న గవర్నర్ రాధాకృష్ణన్
భద్రాచలం: త్రేతాయుగంలో శ్రీరాముడి మహా పట్టాభిషేకం స్మరణకు వచ్చేలా అదే చైత్ర పుష్యమి ముహుర్తానా పట్టాభిషేక మహోత్సవాన్ని భద్రాచల పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తారు. ఈ క్రమంలో గురువారం ఉదయం యాగశాలలో చతుః స్థానార్చన హోమం నిర్వహిస్తారు. 10 గంటలకు శంఖ, చక్ర, ధనుర్బాణాలు ధరించిన లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ విగ్రహాలను మేళతాళాలు, కోలాటం, భక్తుల జయజయ ధ్వానాల నడుమ మిథిలా స్టేడియంలోకి తీసుకొస్తారు. సింహాసనంలో వేంచేపు చేశాక ఎలాంటి విఘ్నాలు రాకుండా విశ్వక్సేన పూజ చేస్తారు. ఆ తర్వాత పుణ్యావాచనం చేసి మంత్రజలంతో ప్రాంగణాన్ని, పూజా సామగ్రిని సంప్రోక్షణ చేస్తారు.
మూడు మండపాలు
పట్టాభిషేకం జరిగే ప్రధాన మండపానికి ముందు మూడు ఉప మండపాలు ఏర్పాటుచేస్తారు. ఒక మండపంలో హన్మంతుడు, సుగ్రీ వుడు సహా ఎనిమిది మంది రామపరివారం, అష్టదిక్పాలకులను, మధ్య మండపంలో మంత్రజలంతో 500నదులు, నాలుగు సముద్ర జలాలను ఆవాహన చేస్తారు. మూడో మండపంలో శ్రీరాముడికి రాజ ముద్ర, రాజదండం, పాదుకలు ఉంచుతారు. అనంతరం అష్టోత్తర సహస్ర నామార్చన, సువర్ణ పుష్పార్చనలతో పూజలు నిర్వహించి పంచకుండాత్మక, పంచేష్ఠి సహిత చతుర్వేద హవనం, మండపత్రయ ఆరాధన నిర్వహిస్తారు.
ఎనిమిది మంది మంత్రులు
శ్రీరాముడి పట్టాభిషేకం నిర్వహించేందుకు వైదిక మంత్రాలతో వశిష్టుడు, వామనుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతము డు, విజయుడు, సుయజ్ఞుడు అనే 8మంది మంత్రులను వేద పండితులు వరింపజేసుకుంటారు. అనంతరం పట్టాభిషేకం నిర్వహిస్తారు. వీరికి నేతృత్వం వహించేందుకు వాల్మికి స్థానాన్ని మరొకరు వరింపజేసుకుని పట్టాభిషేక మహోత్సవాన్ని పూర్తి చేస్తారు.
ముఖ్య అతిధిగా గవర్నర్
పట్టాభిషేక వేడుకలకు గవర్నర్లు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా గవర్నర్ రాధకృష్ణన్ భద్రాచలం రానున్నారు. పట్టాభిషేకాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తే విజయసిద్ధి కలుగుతుందని నమ్మకంతో సీతారాముల కల్యాణానికి వచ్చిన భక్తులు చాలా మంది బుధవారం రాత్రి భద్రాచలంలోనే ఉండిపోయారు.