రఘునాథపాలెం: ఎండలు పెరుగుతున్నందున ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో నీడ కోసం టెంట్లు వేయడమే కాకుండా తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ వీ.పీ.గౌతమ్ అదేశించారు. రఘునాథపాలెం మండలం మండలంలోని చెరువుకొమ్ము తండా, వేపకుంట్ల, గణేశ్వరంలో ఉపాధి పనులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల వివరాలతో పాటు కూలీలకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, డీపీఓ హరికిషన్, డీఆర్‌డీఓ సన్యాసయ్య, ఏపీడీలు శిరీష, శ్రీదేవి, డీఎల్‌పీఓ కీర్తి ప్రభాకర్, ఎంపీడీఓ అశోక్ కుమార్, ఎంపీఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, వేపకుంట్లలోని చెరువు నుంచి తవ్విన మట్టిన తరలిస్తున్న ట్రాక్టర్ల డ్రైవర్లతో కలెక్టర్ మాట్లాడారు. మట్టి ఎక్కడకు తీసుకెళ్తున్నారని ఆరా తీయగా రైతుల పొలానికి అని చెప్పారు. దీంతో రైతును కూడా పిలిపించి నిజమేనా, కాదా అని ప్రశ్నించారు. ఎక్కడ కూడా మట్టి పక్కదారి పట్టకుండా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.