అటు కాంగ్రెస్‌.. ఇటు బీజేపీ!

- - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాపై జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ ప్రత్యేక దృష్టి సారించాయి. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోకుండా జిల్లాలో వరుస కార్యక్రమాల నిర్వహణకు రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బీజేపీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఈనెల 15న ఇక్కడ నిర్వహించే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొననున్నారు.

ఇప్పటికే ఆయన పర్యటన ఖరారు కాగా.. మరోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ యాత్ర ఈనెల 25న ఖమ్మంలో ముగియనుంది. ఈ సందర్భంగా ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరవుతారని చెబుతున్నారు. రోజుల తేడాలోనే రెండు పార్టీల జాతీయ నేతలు జిల్లాకు రానుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

బీజేపీ.. మహాజన సంపర్క్‌ అభియాన్‌
బీజేపీ జాతీయ నాయకత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై నజర్‌ పెట్టింది. అర్బన్‌ ప్రాంతాల్లోనే బీజేపీ బలంగా ఉందని.. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో పార్టీ బలహీనంగా ఉందని ఇటీవల జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఖమ్మం కేంద్రంగా కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది. గతనెల 27న ఖమ్మంలో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. గత మూడు నెలల క్రితం కూడా బండి సంజయ్‌ జిల్లాకు వచ్చారు.

ఇక ఈనెల 15న ఖమ్మంలో జరిగే మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొంటారని బండి సంజయ్‌.. జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణకు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా దాదాపు లక్ష మందితో సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించగా, ఈనెల 9న సంజయ్‌ ఖమ్మం వచ్చి ఏర్పాట్లపై సూచనలు చేయనున్నారు. కాగా, అమిత్‌షా వెంట కేంద్రమంత్రులు బీఎల్‌.వర్మ, కిషన్‌రెడ్డితోపాటు మరికొందరు మంత్రులు, అలాగే జాతీయ నేతలు హాజరవుతారని తెలిసింది. ఖమ్మంలో అమిత్‌షా పాల్గొనే సభను విజయవంతం చేయడం ద్వారా పార్టీ సత్తా చాటాలనే యోచనలో పార్టీ నాయకత్వం ఉంది.

కాంగ్రెస్‌ ‘మార్చ్‌’
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మార్చి 16న ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌ నియోజకవర్గం ఇచ్చోడ మండలం పిప్రి నుంచి పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర చేపట్టారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ మీదుగా సాగుతున్న ఆయన పాదయాత్ర మంగళవారం 82వ రోజుకు చేరింది.

ఆపై నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా ఈనెల 25న ఖమ్మంకు చేరుకోనున్నారు. ఆరోజుతో పాదయాత్ర 101రోజులు పూర్తవుతుంది. జిల్లాలో యాత్ర అనంతరం ముగింపు సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. రెండు లక్షల మందిని సమీకరించాలని టీపీసీసీ నిర్ణయించింది. సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని ఆహ్వానించాలని పార్టీ నేతలు యోచిస్తుండగా, ఆయనతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే రానున్నారు.

రాజుకున్న రాజకీయ వేడి
జూన్‌ నెలలో జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. అన్ని పార్టీలకు ఈనెల కీలకంగా మారగా.. వరుస కార్యక్రమాలపై దృష్టి సారించాయి. ఒకే నెలలో రెండు జాతీ య పార్టీల ప్రముఖ నాయకులు ఖమ్మం రానుండటం.. సభలను విజయవంతం చేసి సత్తా చాటాలని ఇరు పార్టీలు ఇప్పటి నుంచే సర్వశక్తులొడ్డుతున్నాయి. మరోవైపు ఈ నెలలోనే మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఊహాగానాలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు ఎన్నికల్లోనూ సత్తా చాటింది.

వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అధిక సీట్లు గెలవాలనే లక్ష్యంతో కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించగా.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు బీజేపీ కూడా జిల్లాలో పుంజుకునేందుకు తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేంద్ర నాయకత్వం ప్రత్యేక చొరవతో ఖమ్మంలో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక బీఆర్‌ఎస్‌ కూడా ఖమ్మంకు ప్రాధాన్యత ఇస్తోంది. జనవరి 18న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ నిర్వహించడంతోపాటు పలు కార్యక్రమాల నిర్వహణకు ఖమ్మంను ఎంచుకుంది. మొత్తం మీద ఖమ్మం అన్ని పార్టీలకు కేంద్రంగా మారుతోంది.

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top