రాయచూరు రూరల్: సమాజంలో నశించి పోతున్న స్వదేశీ కళలకు ప్రాణం పోయాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శ్రీదేవి నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో కలా సంకుల సంస్థ ఏర్పాటు చేసిన స్వదేశీ సంబరాల కార్యక్రమంలో మాట్లాడారు. టీవీ, మొబైల్ వాడకం లేని సమయంలో దేశీయ కళలకు ప్రాధాన్యత ఉండేదన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగంలో కళలకు ఆదరణ కరువైందన్నారు. సినీ నటి పూజా, శాంతప్ప, వీర హనుమాన్, వీరణ్ణ రుద్రాక్షి, వసంత లక్ష్మి, హనుమంతప్ప, అస్లాం పాషా, శివశంకర్, శ్రీనివాస్, తులసి, మారుతిలున్నారు. 21 మంది సమాజ సేవకులకు అవార్డులను అందించారు.
మత్తు పదార్థాల
బెడద అరికడదాం
రాయచూరు రూరల్ : నగరంలో మత్తు పదార్థాల బెడద అరికడదామని నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో పేర్కొన్నారు. స్వామి వివేకానంద చౌక్ వద్ద జిల్లా యంత్రాంగం, జడ్పీ, మహానగర పాలికె, పోలీస్ శాఖ, రిమ్స్‌ల ఆధ్వర్యంలో జరిగిన మాదక వ్యసనాల నుంచి విముక్తిపై ప్రచార జాగృతి ర్యాలీని ప్రారంభించి ఆయన మాట్లాడారు. యువత డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారన్నారు. యువకులు దురలవాట్లకు గురై ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. యువత గంజాయి, హఫీం వంటి వాటికి బానిస కారాదన్నారు. జాతాలో జిల్లారోగ్యాధికారి నందిత, డాక్టర్లు రమేష్, గణేష్, శాకీర్, సరోజ, సంధ్య, సురేష్ ఉన్నారు.
ధరల పెంపును నిరసిస్తూ ర్యాలీ
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నఫళంగా పెంచిన పాల ధరను తగ్గించాలని ఎస్‌డీపీఐ డిమాండ్ చేసింది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు మతీన్ బాబా మాట్లాడారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందన్నారు. ఆర్టీసీ బస్ చార్జిలను పెంచి ప్రజలపై భారం మోపడంతో మధ్యతరగతి వర్గాలు, పేదలు నలిగి పోతున్నారని దుయ్యబట్టారు. పాలు, బస్సు చార్జీల పెంపును విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
చెరకు రైతును
ప్రభుత్వాలు ఆదుకోవాలి
రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన చెరకు, కంది పంటలకు టన్నుకు రూ.5,500 ధర కేటాయించి ఆదుకోవాలని మాజీ మంత్రి బండెప్ప కాశంపుర డిమాండ్ చేశారు. మంగళవారం బీదర్ పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో రైతులు జరిపిన చర్చలు ఫలించలేదన్నారు. రైతులు కోరుతున్న మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. పాలు, బస్ చార్జీల ధరలు పెంచడం, కరువు సహాయక పనులు చేప ట్టక పోవడాన్ని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పంచ గ్యారెంటీల పేరుతో రాష్ట్రాన్ని దివాళా తీయించిందని ఆయన ఆరోపించారు.
మృతుని కుటుంబానికి పరిహారం వితరణ
రాయచూరు రూరల్: బీదర్ తాలూకాలోని బరూర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మృతి చెందిన రోషన్ అనే యువకుడి కుటుంబాన్ని సోమవారం జెస్కాం కార్యాలయంలో బీదర్ గ్రామీణ శాసన సభ్యుడు డాక్టర్ శ్రీశైలేంద్ర బెల్దాళ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి జెస్కాం శాఖ నుంచి రూ.5 లక్షల పరిహారధనం చెక్‌ను ఆయన అందించారు.


