బొమ్మనహళ్లి: శివమొగ్గలోని త్యావరెకొప్ప పులి–సింహాల జూ పార్క్‌లో నీటి ఏనుగు దాడిలో మరణించిన పశువైద్యురాలు సమీక్షా రెడ్డి పేరును, బన్నేరుఘట్ట జూ పార్క్‌లోని ఒక నీటి ఏనుగు పిల్లకు పెట్టారు. బన్నేరుఘట్ట ప్రాంతానికే చెందిన సమీక్షా రెడ్డి త్యావరెకొప్ప జూపార్క్‌లో పశువైద్యురాలిగా పనిచేసేవారు. ఓ హిప్పోకు వైద్యం చేస్తుండగా అది దాడి చేయడంతో ఆమె మరణించడం తెలిసిందే. ఈ సందర్భంగా అటవీ మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ, బన్నేరుఘట్ట హిప్పో ప్రాంగణానికి సమీక్ష వారణాసి అని పేరు మారుస్తామని తెలిపారు.
100కు చేరిన టపాసుల బాధితులు
బనశంకరి: దీపావళి పండుగ సమయంలో టపాసులు కాలుస్తూ బెంగళూరు నగరంలో గాయపడినవారి సంఖ్య వందకు పెరిగింది. బాధితులు వివిధ కంటి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాలల నుంచి మధ్యవయస్కుల వరకూ బాధితులు ఉన్నారు. మింటో కంటి ఆస్పత్రిలో 20 మంది చేరారు. కళ్లకు తీవ్ర గాయాలైన 12 మందిని ఈ ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. మరో కార్పొరేట్ ఆస్పత్రికి 41 మంది వరకూ వైద్యానికి వచ్చారు.
ముగిసిన హాసనాంబ దర్శనం
● నేడు గర్భగుడి మూసివేత
దొడ్డబళ్లాపురం: ఏడాదికి ఒకసారి మాత్రమే దర్శన భాగ్యం కలిగించే హాసన్ నగరంలోని హాసనాంబ దేవాలయం గర్భగుడి తలుపులు నేడు మూసివేయనున్నారు. మంగళవారం నాటికి దేవి దర్శనానికి ఆఖరిరోజు. వివిధ పూజా వేడుకలు నిర్వహించి బుధవారంనాడు గర్భగుడి తలుపులు బంద్ చేస్తారు. సీఎం సహా అనేకమంది కేంద్రమంత్రులు అమ్మవారికి దర్శించారు. ఈ ఏడాది కూడా రికార్డు స్థాయిలో భక్తులు దర్శనం చేసుకున్నట్టు ఆలయ అధికారి జగదీష్ గంగణ్ణవర్ తెలిపారు. 28.75 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. రూ. వెయ్యి, రూ.300 దర్శనం టికెట్లు, లడ్డు కొనుగోలుతో దేవాలయానికి రూ.24 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. మంగళవారం రాత్రి సిద్ధేశ్వరస్వామి రథోత్సవం నిర్వహించారు. బుధవారంనాడు అగ్నిగుండం వేడుక జరుగుతుంది.


