హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె సమీపంలోని తుంగభద్ర డ్యాంలో నీటినిల్వ రోజురోజుకూ తగ్గిపోతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటినిల్వ 33.833 టీఎంసీలకు పడిపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో పది రోజుల్లోనే కాలువలకు నీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. నీటిపారుదల సలహా సమితి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం నవంబర్ 20వ తేదీ వరకు కాలువలకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే రుతుపవనాల సమయంలో ఆశించిన స్థాయిలో నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడం, జలాశయానికి ఎగువ నుంచి ఎలాంటి నీటి ప్రవాహం లేకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. వర్షాలు కురిసి జలాశయంలోకి నీరు చేరితే డిసెంబర్ 10వ తేదీ వరకు కాలువలకు నీటిని విడుదల చేయవచ్చని భావించారు. కానీ వరుణుడి కరుణ లేక పోవడంతో ఆ ఆశలు ఆవిరవుతున్నాయి.
డిసెంబర్ 10 వరకు నీరు అసాధ్యం
డిసెంబర్ 10 వరకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను పరిశీలిస్తే అది సాధ్యమయ్యేలా లేదని తుంగభద్ర బోర్డు వర్గాలు వెల్లడిస్తున్నాయి. 2023లో ఎదురైన కరువు పరిస్థితులు ఈసారి కూడా పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గరిష్టంగా 105.78 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉన్న జలాశయంలో 2023లో 89 టీఎంసీల నీరు మాత్రమే చేరగా, ఈ ఏడాది 96 టీఎంసీల నీరు నిల్వ చేరింది. ప్రస్తుతం ఆ నిల్వ కూడా క్రమంగా తగ్గుతూ 33.833 టీఎంసీలకు చేరుకుంది. మరో వైపు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ఐసీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నవంబర్ 20వ తేదీ నుంచి కాలువలకు నీటి విడుదల నిలిపి వేయాల్సిన పరిస్థితి రావచ్చని తుంగభద్ర బోర్డు సెక్షన్ ఇంజనీర్ కిరణ్ వెల్లడించారు. మొత్తం మీద వర్షాభావ పరిస్థితులు, జలాశయంలో తగ్గుతున్న నీటినిల్వలు తుంగభద్ర ఆయకట్టు రైతులను కలవరపెడుతున్నాయి. కాలువలకు నీటి సరఫరా నిలిచి పోతే పంటల పరిస్థితి ఏమిటన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.
తుంగభద్ర డ్యాంలో తగ్గుతున్న నీటినిల్వ
హొసపేటె సమీపంలోని తుంగభద్ర డ్యాం
తుంగభద్ర డ్యాంలో 33.833
టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వ
మరో 10 రోజుల్లో కాలువలకు
నిలిచి పోనున్న నీటి సరఫరా.!
వర్షాలు లేక నిండని జలాశయం..
రైతన్నలకు ఎదురుకానున్న కష్టాలు


