హుబ్లీ: నగరంలో ఆన్‌లైన్ కేటుగాళ్లు ఇద్దరిని వేర్వేరుగా వంచించారు. వారి నుంచి లక్షలాది రూపాయలను బదలాయించుకున్నారు. వివరాలు.. వాట్సాప్ గ్రూప్‌కు వచ్చిన ఆర్‌టీఓ చానల్ ఏపీకే యాప్ ద్వారా మొబైల్ హ్యాక్ చేసి స్థానిక మంటూరు రోడ్డు వెంకటేశ్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.2.18 లక్షలను బదలాయించుకున్నారు. ఏపీకే యాప్ దృష్టికి రాకుండానే డౌన్‌లోడ్ అయింది. ఈ క్రమంలో మొబైల్ హ్యాక్ చేశారు. అంతేగాక ఆర్‌బీఎల్ క్రెడిట్ కార్డు నెంబర్ వివరాలు తీసుకుని దశల వారీగా రూ.2,18,508 బదలాయించుకొని వంచించారు. బాధితుడు నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో బ్యాంక్ ఖాతా ఉన్న ధార్వాడ శివానంద నగర అబ్దుల్ గనీ దృష్టికి రాకుండానే వంచకులు ఆయన రెండు బ్యాంక్ ఖాతాల నుంచి రూ.2,37,998లను తమ ఖాతాలోకి బదలాయించుకొని మోసగించినట్లు అబ్దుల్ గనీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎలక్ట్రిక్ వస్తువులు చోరీ
మరో ఘటనలో స్థానిక గోకుల్ రోడ్డు మంజునాథ నగర్‌లోని కాంప్లెక్స్ బేస్మెంట్‌లో అంగడి తలుపులు తెరిచి లోనికి వెళ్లిన దొంగలు అక్కడ ఉన్న రూ.1.45 లక్షల విలువ చేసే విద్యుత్ పరికరాలను చోరీ చేశారు. ధనరాజ్ శెట్టికి చెందిన సదరు అంగడిలోని ఎలక్ట్రిక్ వైరు, డెకోరేషన్ లైట్లు, ఫ్యాన్ హుక్కు, రాడ్లు, ట్యూబ్‌లైట్‌కు అమర్చే స్రిప్ట్ కనెక్టర్ తదితర సామగ్రిలను చోరీ చేసినట్లు గోకుల్ రోడ్డు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇంకో ఘటనలో మద్యవ్యసని సోదరుడి వేధింపులతో సోదరి ఆత్మహత్య చేసుకున్నారు. నిత్యం మద్యం తాగడానికి డబ్బులు కావాలని వేధిస్తున్న సోదరుడి సతాయింపులకు స్థానిక మహాలక్ష్మీ కాలనీకి చెందిన గీత హబీబ్ (32) తన ఇంట్లోని వంట గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై పాత హుబ్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
వ్యక్తి అదృశ్యం
కాగా మరో ఘటనలో కలఘటిగి తాలూకా బెళవంతర గ్రామంలో కూలీ పని చేసుకొనే వ్యక్తి శనివారం నుంచి కనిపించకుండా పోయారు. మహంతేశ (39) అనే వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లి గత మూడు రోజుల నుంచి ఇంటికి తిరిగి రాలేదని ఆయన బంధువులు కలఘటిగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇద్దరికి రూ.లక్షల్లో వంచన


