భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రథమ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రథమ వార్షికోత్సవం

Oct 28 2026 1:30 AM | Updated on Oct 28 2026 1:30 AM

బళ్లారిఅర్బన్‌: నగరంలోని 20వ వార్డు ఇంటూరి నగర్‌ పార్కు సమీపంలో నూతనంగా నిర్మించిన కాశీ విశ్వనాథ విశాలాక్షి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవ పూజలను మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. దేవస్థానం అధ్యక్షుడు మునిస్వామి మాట్లాడుతూ తెల్లవారు జాము నుంచే గోపూజ, ధ్వజారోహణ, గణపతి పూజ, కాశీ విశ్వనాథ స్వామి మూలవిరాట్‌ శివలింగానికి పంచామృతాభిషేకం, మహా మంగళ హారతి నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం, రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, నగర మేయర్‌ పూజారి గాదెప్ప, జేడీఎస్‌ పార్టీ అధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ, 20వ వార్డు కార్పొరేటర్‌ విక్కీ(వివేక్‌), దేవస్థాన ప్రముఖులు రామకృష్ణ, అవ్వారు శ్రీనివాసులు, వీరేష్‌, రాజన్న, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు రెండు వేల మందికి పైగా భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఇల్లు నిర్మిస్తామంటూ

కాంట్రాక్టర్‌ మోసం

హుబ్లీ: హుబ్లీ సమీపంలోని సుతగట్టి గ్రామం అమాన్‌ కాలనీ నివాసి పద్మావతికి ఇల్లు కట్టిస్తామని ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్‌ రూ.15.14 లక్షలు తీసుకొని ఇల్లు నిర్మించకుండా మోసగించారని బాధితురాలు నవనగర ఏపీఎంసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిగ్గాంవి అక్షయనగర నివాసులైన మంజునాథ, ప్రజ్వల్‌లపై ఆమె కేసు నమోదు చేశారు. ఆరు నెలల్లో ఇంటిని నిర్మించి ఇస్తామని రూ.15.14 లక్షలను దశల వారీగా తీసుకొని అటు ఇల్లు నిర్మించకుండా, ఇటు డబ్బులు తిరిగి ఇవ్వకుండా వంచించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

లారీ, కారు ఢీ.. మహిళ మృతి

మరో ఘటనలో లారీ, కారు ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. లారీ, కార్ల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ముగ్గురు గాయపడిన ఘటన స్థానిక కార్వార రోడ్డు వీరభద్రేశ్వర ఆటోమొబైల్‌ అంగడి వద్ద చోటు చేసుకుంది. గదగ్‌ జిల్లా సణాపురకు చెందిన రేణుకా (22) మృతి చెందారు. అంచటగేరి సుహాస్‌(23), శరణప్ప (26), పూజా (29) గాయపడ్డారు. కార్వార రోడ్డులో లారీని నిర్లక్ష్యంగా నడుపుతూ రివర్స్‌ తీసుకొనే క్రమంలో అంచటగేరి నుంచి హుబ్లీ వైపునకు వస్తున్న కారును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారులో ఉన్న సుహాస్‌, శరణప్ప, పూజకు తల, ముక్కు, ముఖం, చెవులకు గాయాలయ్యాయి.

చివరి ఆయకట్టుకు నీరివ్వండి

రాయచూరు రూరల్‌: తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు సక్రమంగా నీరందాలంటే గేజ్‌ నిర్వహణకు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, విధాన పరిషత్‌ సభ్యుడు బోసురాజు తెలిపారు. మంగళవారం సిరవార తాలూకా అత్తనూరు రైతులతో ఆయన మాట్లాడారు. మైల్‌ నంబర్‌–95 వద్ద నీటి నిర్వహణ గేజ్‌ సామర్థ్యం గురించి జిల్లాధికారికి వివరించారు. ఆయకట్టు చివరి భూములకు నీరందడానికి అధికారులతో చర్చించాలన్నారు. 47వ మైలు వద్ద 12 అడుగులు, 69వ మైలు వద్ద గేజ్‌ నిర్వహణలో 9 అడుగులు, 90వ మైలు వద్ద 5.5 అడుగుల నీరు ఉండే విధంగా గేజ్‌ నిర్వహణకు అధికారులు చొరవ తీసుకుంటే కింది భాగంలోని ఆయకట్టు చివరి భూముులకు నీరందుతాయన్నారు.

మత్తు పదార్థాలను అరికట్టండి

రాయచూరు రూరల్‌: జిల్లాలో గంజాయి, మాదక వస్తువులను నిషేధించడంలో పోలీస్‌, జిల్లాధికార యంత్రాంగం విఫలమైందని జేడీఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు విరుపాక్షి ధ్వజమెత్తారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి, హఫీం, మాదక ద్రవ్యాలను విక్రయించకుండా అడ్డుకోవాలన్నారు. వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ గంజాయి లభిస్తోందని, విచ్చలవిడిగా లభిస్తున్న మాదక వస్తువుల నిషేధానికి పోలీస్‌ యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదన్నారు. దొంగలకు రాజకీయ నాయకులు అండదండలున్నాయని ఆరోపించారు. శాసన సభ్యుడు, మాజీ మంత్రి పుత్రుడు గంజాయి విక్రేతలకు మద్దతు ఇవ్వడంతో నేడు నగరంలో పలు చోట్ల దాడులు, ఘర్షణలతో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని, జిల్లా ఎస్పీని బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు.

మత్తును చిత్తు చేయండి

గంజాయి, హఫీం వంటి మాదక ద్రవ్యాలను విక్రయించకుండా అడ్డుకుని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కరవే అధ్యక్షుడు అశోక్‌ కుమార్‌ జైన్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. నగరంలోని లాల్‌ బహుద్దూర్‌ శాస్త్రి నగర్‌లో కిరాణ దుకాణం నడుపుకుంటున్న నరసింహులు హత్యకు గురి కావడానికి ప్రధాన కారణం గంజాయి, హఫీం మత్తు పదార్థాల సేవనం వల్లే హత్య జరిగిందని అన్నారు. వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ గంజాయి లభిస్తోందని, నగరంలో విచ్చలవిడిగా లభిస్తున్న మాదక వస్తువుల నిషేధానికి పోలీస్‌ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement