హొసపేటె: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హంపీలోని చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణపై యునెస్కో నిపుణుల బృందం ప్రత్యేక దృష్టి సారించింది. హంపీ పరిసర ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలను సందర్శించిన నిపుణులు వాటి నిర్మాణ శైలి, ప్రస్తుత పరిస్థితులు, పరిరక్షణ చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రసిద్ధ విజయవిఠల ఆలయంలోని రాతిరథం, సప్తస్వరాల మండపం సహా పలు చారిత్రక నిర్మాణాలను సందర్శించి వివరాలు సేకరించారు. చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన హంపీ వారసత్వ సంపద పరిరక్షణపై యునెస్కో నిపుణుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఆదివారం అంజనాద్రి కొండను సందర్శించిన బృందం అనంతరం ఆనెగుందితో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలను పరిశీలించింది. కెన్యాకు చెందిన జార్జ్ అబుంగ్, జపాన్‌కు చెందిన ఇచిడా షిమోడా నేతృత్వంలోని నిపుణుల బృందం ప్రసిద్ధ విజయవిఠల ఆలయాన్ని సందర్శించి అక్కడి అపురూప శిల్పకళా సంపదను పరిశీలించింది. ఆలయ ప్రాంగణంలోని ప్రపంచ ప్రఖ్యాత రాతి రథం, సంగీత మండపం, నృత్య మండపం, కళ్యాణ మండపం, గర్భగుడి నిర్మాణాలను నిశితంగా పరిశీలించింది.
సప్తస్వరాలకు మంత్రముగ్ధం
ముఖ్యంగా సంగీత మండపంలోని రాతి స్తంభాల ప్రత్యేకతను గమనించి మరింత అధ్యయనం చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించింది. అనంతరం గజ్జెల మండపం నుంచి బ్యాటరీ వాహనంలో విజయవిఠల ఆలయం, మాల్యవంత రఘునాథ ఆలయ ప్రాంతాలకు చేరుకుని అక్కడి చారిత్రక కట్టడాల వివరాలను సేకరించింది. ఈ సందర్భంగా హంపీ ప్రాంతంలోని వారసత్వ స్మారక చిహ్నాల పరిరక్షణకు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం. హంపీ చుట్టు పక్కల ఉన్న రక్షిత ప్రాంతాలు, బఫర్ జోన్లలో అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని యునెస్కో నిపుణుల బృందం అధికారులు సూచించింది.
హంపీలోని స్మారకాలను పరిశీలిస్తున్న అధికారుల బృందం
తుంగభద్ర డ్యాంను సందర్శించిన యునెస్కో బృందం
హంపీతో పాటు పరిసరాల్లోని
స్మారకాల పరిశీలన
చారిత్రక సంపదకు నష్టం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టండి
అధికారులకు యునెస్కో నిపుణుల
బృందం సూచన
తుంగభద్ర డ్యాం సందర్శన
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హంపీ చారిత్రక కట్టడాల పరిరక్షణ చర్యలను పరిశీలిస్తున్న యునెస్కో నిపుణుల బృందం విజయనగర జిల్లాలోని తుంగభద్ర డ్యాంను కూడా సందర్శించింది. విజయనగర జిల్లాధికారిణి కవిత ఎస్. మన్నికేరి సమక్షంలో యునెస్కో బృందం మంగళవారం తుంగభద్ర జలాశయాన్ని వీక్షించింది. ఈ సందర్భంగా డ్యాం నిర్మాణ విశేషాలు, ఆనకట్ట పని తీరు, జలాశయంలో నీటి నిల్వలు, నీటి నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులు బృందానికి వివరించినట్లు సమాచారం. చారిత్రక ప్రాధాన్యత కలిగిన హంపీ ప్రపంచ వారసత్వ సంపద పరిరక్షణలో తుంగభద్ర జలాశయం, దాని పరిసర ప్రాంతాలకు ఉన్న ప్రాముఖ్యతను కూడా బృందం పరిశీలించింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాల పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి, చారిత్రక కట్టడాల సంరక్షణకు సంబంధించిన అంశాలపై యునెస్కో నిపుణుల బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.


