ఉద్యానంలో కొండచిలువ | - | Sakshi
Sakshi News home page

ఉద్యానంలో కొండచిలువ

Oct 28 2026 1:36 AM | Updated on Oct 28 2026 1:36 AM

మైసూరు: నగరంలోని జాకీ క్వార్టర్స్‌ వద్ద ఉన్న పార్కులో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. పార్కులోని ఉన్న సందర్శకులు పొదలో కదలాడుతున్న సుమారు 10 అడుగుల పొడవైన కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఉరగ నిపుణుడు స్నేక్‌ ప్రదీప్‌కు సమాచారమిచ్చారు. కొంతసేపటికే వచ్చిన ప్రదీప్‌ దానిని సురక్షితంగా పట్టుకుని సంచిలో బంధించారు. అటవీ అధికారులతో కలిసి నగర శివార్లలోని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. అధికారులు పార్కుల్లో పారిశుధ్య చర్యలు తీసుకోవాలని, చిన్నపిల్లలు, వృద్ధులపై ఇటువంటి జీవులు దాడులు చేసే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తంచేశారు.

సిద్దుపై అర్జీ కొట్టివేత

శివాజీనగర: మాజీ సీఎం సిద్దరామయ్య మైనింగ్‌ లైసెన్స్‌ను అక్రమంగా పునరుద్ధరించుకున్నారని, దీనిపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బెంగళూరు వ్యాపారవేత్త ఎం.పీ.వేణుగోపాల్‌ దీనిని దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ ఇప్పటికే ఓ ప్రైవేట్‌ ఫిర్యాదును ట్రయల్‌ కోర్టు కొట్టివేసిందని, లోకాయుక్త కూడా ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. వాదనలు ఆలకించిన ధర్మాసనం అర్జీని తిరస్కరించింది.

కుక్కను పట్టబోయి

బావిలోకి పడ్డ చిరుత

యశవంతపుర: కుక్కను తరుముతూ వెళ్లిన చిరుతపులి బావిలోకి పడింది. ఉడుపి జిల్లా కుదురేముఖ అరణ్యం పరిధిలో కార్కళ తాలూకా నిట్టె గ్రామం ముజకిలలో ఈ సంఘటన జరిగింది. ఆంథోనీ అనే వ్యక్తి ఇంటివైపు వచ్చిన చిరుత ఆ ఇంట్లోని పెంపుడు కుక్కను వెంటాడింది. కుక్క తప్పించుకుని పారిపోగా చిరుత అదుపుతప్పి ఇంటి ఆవరణలోని బావిలోకి పడింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అటవీ సిబ్బంది బోనులతో వచ్చి బావిలోకి దించారు. చిరుతను బోనులో బంధించి అడవిలోకి తరలించారు. ఈ చిరుత ఐదేళ్ల వయసుదని, సుమారు 100 కేజీల బరువుందని తెలిపారు. ఇంతపెద్ద చిరుతను ఎప్పుడూ చూడలేదని కార్కళ అటవీశాఖ అధికారి అరుణ్‌కుమార్‌ తెలిపారు.

బూట్లలో గంజాయి రవాణా

దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు ఒక ప్రయాణికుని నుంచి హైడ్రోఫోనిక్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడు తన బూట్ల లోపల గంజాయి ప్యాకెట్లను దాచాడు. తనిఖీలలో దానిని గుర్తించారు. రూ.17.50 లక్షల విలువైన 500 గ్రాముల గంజాయిని సీజ్‌ చేసి నిందితున్ని అరెస్టు చేశారు.

రెండు వాహనాల ఢీ,

ఇద్దరికి గాయాలు

దొడ్డబళ్లాపురం: కారు, టెంపో ట్రావెలర్‌ వాహనాలు ముఖాముఖి ఢీకొన్న సంఘటన హిందూపురం–యలహంక రహదారి మార్గంలోని దొడ్డ తాలూకా బచ్చళ్లి గేట్‌ వద్ద జరిగింది. మంగళవారం ఉదయం దొడ్డబళ్లాపురం మీదుగా గౌరిబిదనూరుకు వెళ్తున్న ట్రావెలర్స్‌ వాహనం, గౌరిబిదనూరు నుంచి వస్తున్న కారు బచ్చళ్లి గేట్‌ వద్ద ఎదురుగా గుద్దుకున్నాయి. వాహనాల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు గాయపడగా దొడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో రహదారిపై కాసేపు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement