● గతంలో 5.54 కోట్ల మంది ఓటర్లు
● తాజా అంతిమ ఓటరు జాబితాలో
4.45 కోట్ల మందే
● ఎన్ని ఆందోళనలు జరిగినా
చలించని ఈసీ
సర్ పేరుతో విచ్చలవిడిగా ఓట్లను తీసేస్తామంటే కుదరదు. ఎన్నికల సంఘం జవాబుదారీగా వ్యవహరించాలి.. అని ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ సహా అనేకమంది మేధావులు, సామాజిక కార్యకర్తలు నిరసనలు జరిపినా ఏమీ మారలేదు. సర్ అనే ఆయుధంతో ఎన్నికల సంఘం ఊచకోత కోసింది.
బెంగళూరు విల్సన్ గార్డెన్‌లో సర్ పరిశీలన (ఫైల్)
రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 4 లక్షలు అధికం
బనశంకరి: కన్నడనాట ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భారీగా ఓటర్లు అదృశ్యమయ్యారు. ఏకంగా 99 లక్షల ఓట్లకు కోత పడడంతో ఆ మేరకు ఓటర్ల సంఖ్య క్షీణించింది. రాష్ట్రంలో తుది ఓటరు జాబితాలో 4.55 కోట్ల ఓటర్లు మిగిలారు. సర్‌కు ముందు 5.54 కోట్ల మంది ఓటర్లు ఉండేవారు. తుదిజాబితాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం గమనార్హం.
4 నెలలుగా ఏరివేత
గత 4 నెలలుగా వాద ప్రతివాదనల మధ్య కన్నడనాడులో సర్ వ్యవహారం కొనసాగింది. వేలాది మంది బీఎల్‌ఓలు ఓటర్ల సవరణను నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) అన్బుకుమార్ ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. మంగళవారం బెంగళూరులోని తమ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
కోటి నుంచి 99 లక్షలకు
2026 జూన్ 16 నాటికి కర్ణాటక ఓటర్ల జాబితాలో 5,54,32,314 మంది ఉండేవారు. సర్ ద్వారా పరిశీలన జరిపి డబుల్ ఓట్లు, అడ్రస్‌లో లేకపోవడం, మృతులు.. ఇలా పలు అంశాల కింద తొలగింపు సాగించారు. ఇలా 1,07,96,339 పేర్లను పరిశీలనలో పెట్టారు. ఆగస్టు 24న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో సుమారు 4.46 కోట్ల ఓటర్లు తేలారు. పార్టీలు, ఓటర్ల అభ్యంతరాల తరువాత పరిశీలన జరిపి మరికొంతమందిని చేర్చారు. అంతిమ జాబితాలో 4.55 కోట్ల ఓటర్లకు చోటిచ్చారు. ఇలా 99 లక్షల మంది ఓటర్లు తగ్గిపోయారు. దేశంలో అత్యధికంగా ఓట్లు పోయిన రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటని తెలుస్తోంది.
10 లక్షల ఫారం–6లు
జూన్ 16 నుంచి అక్టోబరు 22 వరకు ఓటర్ల నుంచి 25,87,461 దరఖాస్తులను స్వీకరించామని సీఈఓ తెలిపారు. కొత్త ఓటర్ల నుంచి 10,42,863 ఫారం–6 దరఖాస్తులు వచ్చాయన్నారు. తొలగింపుల కోసం ఫారం–7 కింద 2,28,917 దరఖాస్తులు చేరాయన్నారు.
మహిళా ఓటర్లే ఎక్కువ
నూతన ఓటరు జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,25,40,493 మంది పురుషులు, 2,29,12,355 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తృతీయ లింగ ఓటర్లు 2,841 మంది.
సైనికులు, రక్షణ సేవల ఓటర్లు 44,322 మంది. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 3,252 మంది ఉన్నారు.
18–19 ఏళ్లలోపు యువ ఓటర్లు 6,83,364 మంది.
85 ఏళ్లకు పైబడిన అత్యంత వృద్ధ ఓటర్లు 3,92,134 మందిగా తేలారు
దివ్యాంగ ఓటర్లు 5,65,340 మంది ఉన్నారు.
భారీ ప్రభావం చూపిన ఎస్‌ఐఆర్
చెక్ చేసుకోండి
తుది జాబితాలో తమ పేరు ఉందా లేదా అనేది ఓటర్లు ఎన్నికల సంఘం వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా పరిశీలించుకోవాలి. పేర్లు లేని అర్హులైన ఓటర్లు స్థానిక అధికారులను సంప్రదించాలి. పేరు చేర్చడానికి ఫారం– 6ను అందజేయాలి. పేరు, అడ్రస్ తదితరాల సవరణలకు ఫారం–8 వినియోగించవచ్చు.


