● ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
దొడ్డబళ్లాపురం: ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు కార్యాచరణకు వెళ్లిన బెళగావి సిటీ కార్పొరేషన్ అధికారులపై అంగళ్లదారులు గొడవకు దిగి దాడి చేశారు. శనివారం ఉదయం నాథపై సర్కిల్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించాలని జేసీబీలతో వెళ్లారు. ఈ సమయంలో కొందరు స్థానికులు, వ్యాపారులు గుంపులుగా వచ్చి అడ్డుపడ్డారు. మాటా మాటా పెరిగి రాళ్లు విసిరి దాడికి పాల్పడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లా ఎస్పీ కార్తీక్ వచ్చి వివరాలు తెలుసుకున్నారు. దాడికి గురైన అధికారులు శహాపుర పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. తమకు పోలీసులు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. దాడి చేసినవారిని వారిని అరెస్టు చేయాలని డిమాండు చేశారు.
ఐఏఎస్ జ్ఞానేంద్ర
ప్రాసిక్యూషన్‌కు ఓకే
బనశంకరి: సంచలన కేపీఎస్‌సీ పశువైద్యాధికారుల ఉద్యోగాల స్కాంలో అరెస్టయిన ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్ గంగ్వార్ ప్రాసిక్యూషన్ కు సీఎం డీకే.శివకుమార్ అనుమతి ఇచ్చారు. అతనిపై చట్టపరమైన చర్యలకు సమ్మతించారు. కొన్నివారాల కిందట అతన్ని ఈడీ అరెస్టు చేసి 14 రోజులు విచారించింది, ఇప్పుడు కారాగారంలో ఉన్నాడు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడే చర్యలను తమ ప్రభుత్వం సహించదని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. పరిపాలనలో పారదర్శకత, ప్రామాణికతకు ప్రాధాన్యత ఇస్తామని, అవినీతికి చోటు లేదని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
స్విచ్ వేయగానే గ్యాస్ పేలుడు
● బెంగళూరు వంటల గోదాములో ఘటన
యశవంతపుర: వంటగ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు గాయపడిన ఘటన బెంగళూరు రాజరాజేశ్వరి నగరలో జరిగింది. వివరాలు.. బబ్లు అనే వ్యక్తి 20 ఏళ్ల నుంచి పానీపూరీ వ్యాపారం చేస్తున్నాడు. వంటలు వండడానికి ఓ గోడౌన్‌ను బాడుగకు తీసుకొని అందులో కార్మికులతో పాటు తోపుడు బండ్లును ఉంచేవాడు. శుక్రవారం రాత్రి సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయింది. శనివారం ఉదయం పనివాళ్లు లైటు కోసం స్విచ్ వేయగా గ్యాస్ పేలుడు సంభవించి మంటలు వ్యాప్తించాయి. అక్కడే ఉన్న ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేసి బాధితులను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
ఉడుపిలో అగ్ని ప్రమాదం
ఉడుపి నగరంలోని కన్నిమూల్కి డెలియా లేఔట్‌లో ఒక ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. శుభకార్యం ఉండడంతో వంటలు చేస్తుండగా పక్కనే ఉన్న భర్తీ గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకుని పేలుడు జరిగింది, ఓ వంట మనిషి తీవ్రంగా గాయపడ్డారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఆగని ‘సర్’ నిరసన
శివాజీనగర: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా బెంగళూరు స్వతంత్ర పార్కులో పోరాటం తిరిగి ప్రారంభమైంది. సామాజిక కార్యకర్తలు, రాజకీయ పార్టీలు, కాక్రోచ్ జనతాపార్టీ వంటి కొన్ని సామాజిక సంస్థల నాయకత్వంలో నిరసన ప్రదర్శన శనివారం కూడా కొనసాగింది. సర్‌ను వెంటనే రద్దు చేయాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. నిరసనకారులు జాతీయ జెండా, రాజ్యాంగ ప్రతితో పాటు పలు ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రభుత్వం తప్పు దిద్దుకునేవరకూ పోరాటం కొనసాగుతుందని ఎద్దేళు కర్ణాటక ప్రతినిధి నూర్ శ్రీధర్ అన్నారు.న్యాయవాది వినయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్లు జవాబుదారీతనం లేకుండా వ్యవహరించకూడదని అన్నారు.


