సాక్షి,బళ్లారి: తుంగభద్ర డ్యాం నుంచి ఎగువ కాలువ(హెచ్‌ఎల్‌సీ)కు ఐదు రోజుల పాటు నీటి సరఫరా నిలుపుదల చేశారు. శనివారం నుంచి ఐదు రోజులు నీరు నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ రోజురోజుకు తగ్గిపోతున్న నేపథ్యంలో ఆయకట్టు పరిధిలోని పంటలను కాపాడేందుకు, దామాషా ప్రకారం హెచ్‌ఎల్‌సీ రైతులకు నీరు ఇవ్వడానికి అధికారులు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. హెచ్‌ఎల్‌సీ పరిధిలో విస్తారంగా వరి, మిర్చి పంటలను సాగు చేశారు. నవంబర్ 1 నుంచి 20వ తేదీ వరకు కాలువకు నీరు విడుదల చేసేందుకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాలువలకు నీరు నిలుపుదల చేసిన సమయంలో వరుణుడు కనికరించడంతో రైతుల్లో హర్షాతిరేకం వ్యక్తం అవుతోంది. రెండు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురవగా, శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జోరుగా వర్షం కురవడంతో ఆయకట్టు పరిధిలోని మిర్చి, వరి, మొక్కజొన్న తదితర పంటలకు నీటి సమస్య లేకుండా పోయిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆయకట్టులో పంటలు కళకళ
మిర్చి పంటకు నీరు అందించేందుకు అష్టకష్టాలు పడుతున్న సమయంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మిర్చి పంట కళకళలాడుతోందన్నారు. మిర్చి పంట ఏపుగా పెరిగిందని, కాలువలకు నీరు విడుదల చేసే వరకు పంటలకు ఎలాంటి ఢోకా ఉండదని రైతులు భావిస్తున్నారు. నవంబర్ 1 నుంచి మళ్లీ కాలువకు నీరు విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకోవడంతో అప్పటి వరకు పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రైతు ఎర్రిస్వామి పేర్కొన్నారు. నవంబర్ 20 వరకే కాలువలకు నీరు విడుదల చేసి నిలుపుదల చేస్తే, మిర్చి పంట పూర్తి స్థాయిలో పండే అవకాశం ఉండదన్నారు. లేకుంటే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో తుంగభ ద్ర ఆయకట్టు కింద పంటలు సాగు చేసిన ప్రతి రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతులకు పూర్తి స్థాయిలో మేలు జరగాలంటే నవంబర్ చివరి వరకు లేదా డిసెంబర్ నెలలో కూడా నీరు విడుదల చేయాలన్నారు. లేదా ఇకపై కూడా వర్షాలు ఇలా కురిస్తే పంట చేతికందుతుందని లేకపోతే మిర్చి పంట సాగు చేసిన రైతులకు నష్టాలు సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఏపుగా పెరిగిన వరి పైరు
కళకళలాడుతున్న మిరప పంట
అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు
హెచ్‌ఎల్‌సీకి నీటి కోటా నిలుపుదల


