ఎన్‌ఆర్‌బీసీకి నీటి కోసం రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌బీసీకి నీటి కోసం రాస్తారోకో

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటక జిల్లాల్లోని రాయచూరు, లింగసూగూరు, దేవదుర్గ, యాదగిరి జిల్లాల్లోని శహాపుర, భీమరాయనగుడి, సురపుర తాలూకాల్లో నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్‌ఆర్‌బీసీ)కు నిరంతరంగా నీటిని విడుదల చేయాలని రైతు సంఘం అధ్యక్షుడు అరవింద్‌ కులకర్ణి, మాజీ మంత్రి రాజు గౌడ, మహేష్‌ గౌడ డిమాండ్‌ చేశారు. శనివారం వారు శహాపురలో చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. ఎన్‌ఆర్‌బీసీకి వార బందీ పద్ధతికి స్వస్తి పలికి నిరంతరంగా నీటిని విడుదల చేయాలన్నారు. జిల్లాలో తీవ్ర కరువు నెలకొందని, రైతులకు కరువు పరిహారం అందించాలని రైతులు, ప్రజలు కరువుతో కొట్టు మిట్టాడుతుంటే ప్రజా ప్రతినిధులు మౌనం వహించడం తగదన్నారు. 12 గంటల పాటు విద్యుత్‌ సరఫరాను అందించాలన్నారు. కాలువ కింద ఆయకట్టు చివరి భూములకు నీరందించాలన్నారు. కరువు పరిహారంగా ఎకరాకు రూ.25 వేలు చొప్పున ఇవ్వాలన్నారు. నిర్ణీత గడువులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు.

వీర నారి కిత్తూరు రాణి చెన్నమ్మ

రాయచూరు రూరల్‌: నగరంలో కిత్తూరు రాణి చెన్నమ్మ జయంతిని నిర్వహించారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, కన్నడ సంస్కృతి శాఖ, కిత్తూరు రాణి చెన్నమ్మ సమాజం ఆధ్వర్యంలో తాలూకా పంచ గ్యారెంటీల అమలు సమితి అధ్యక్షుడు పవన్‌ పాటిల్‌ కిత్తూరు రాణి చెన్నమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రంగమందిరంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ బ్రిటిష్‌ సైనికులతో యుద్ధం చేసి ఓటమి ఎరుగని ధీరురాలిగా చెన్నమ్మ పేరొందారన్నారు. తహసీల్దార్‌ పరశురాం, చంద్రశేఖర్‌, విజయలక్ష్మి, దానమ్మ దండెప్పలున్నారు.

అప్పు ఇవ్వనందుకు కిరాణ వ్యాపారి హత్య

రాయచూరు రూరల్‌: కిరాణ దుకాణంలోని నిత్యావసర వస్తువులను అప్పుగా ఇవ్వడానికి నిరాకరించినందుకు వ్యాపారిని హత్య చేసిన ఘటన శనివారం మధ్యాహ్నం నగరంలో చోటు చేసుకుంది. లాల్‌ బహుద్దూర్‌ శాస్త్రి నగర్‌లో కిరాణ అంగడి నడుపుకుంటున్న నరసింహులు(40) అనే వ్యాపారిని గుట్కా, సిగరెట్‌, పాన్‌ మసాలా వంటివి అప్పుగా ఇవ్వాలని, తరువాత డబ్బులు ఇస్తామని యువకులు కోరగా, అందుకు దుకాణం యజమాని నిరాకరించారు. దీంతో గంజాయి మత్తులో ఉన్న యువకులు గొడవకు దిగి చివరికి హత్య చేశారు. కాగా హత్య చేసిన వారి వివరాలను మార్కెట్‌ యార్డు పోలీసులు గోప్యంగా ఉంచారు. ఘటనపై కేసు దర్యాప్తులో ఉంది.

కొత్త భవనాలు నిర్మించరూ

రాయచూరు రూరల్‌: నగరంలో అధ్వాన స్థితికి చేరుకున్న ప్రభభుత్వ ఉద్యోగుల పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. శుక్రవారం సాయంత్రం జిల్లాధికారి కార్యాలయం ఉద్యోగులు అందోళన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అద్యక్షుడు కృష్ణ శ్యావంతగేర మాట్లాడారు. నగరంలోని మంత్రాలయం రఽహదారిలోని ఐబీ కాలనీలో శిథిలావస్థకు చేరిన ఉద్యోగుల వసతి భవనాలను తొలగించి కొత్త వాటి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లాధికారిణి పూవితకు వినతిపత్రం సమర్పించారు.

రోడ్డు ప్రమాదంలో కర్ణాటక యువకుడికి గాయాలు

రాయదుర్గం టౌన్‌: పట్టణంలోని బైపాస్‌ రోడ్డు జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో మొళకాల్మూరు తాలూకా రాంపురం సమీపంలోని ఉర్తాళ్‌ గ్రామానికి చెందిన యువకుడు చిత్రలింగ మొళకాల్మూరు వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తూ వినియోగంలో లేని బ్రిడ్జిలోకి దూసుకెళ్లడంతో మట్టి కుప్పలను ఢీకొని ప్రమాదానికి గురయ్యాడు. ముఖం, తలకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు అతన్ని పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అతడిని బళ్లారి విమ్స్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement