ధార్వాడ జిల్లాలో కుండపోత వర్షం | - | Sakshi
Sakshi News home page

ధార్వాడ జిల్లాలో కుండపోత వర్షం

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

హుబ్లీ: గత కొన్ని రోజులుగా ఎండ వేడిమితో అల్లాడిన జిల్లా ప్రజలను వరుణుడు కరుణించాడు. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి దాకా కుండపోత వర్షం పడటంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. దీంతో రబీ సాగును ప్రారంభించడానికి రైతులు నడుం బిగించారు. భూమాతలో తేమ శాతం కరువై దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నకు రెండున్నర గంటలకు పైగా కురిసిన వర్షం హర్షాన్ని ఇచ్చింది. ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం సాయంత్రం కల్లా చిన్నగా మొదలై ఆ తర్వాత ఏకధాటిగా పడింది. హుబ్లీ, ధార్వాడ, కలఘటిగి, కుందగోళ, అణ్ణిగేరి, అళ్నావర తాలూకాలో వర్షాలు బాగా పడ్డాయని నివేదిక వచ్చింది. హుబ్లీలో 3 గంటలకు పైగా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. నగరంలోని ప్రధాన వీధులైన దాజిబాన్‌ పేటె, తుళజా భవాని, సంగొళ్లి రాయణ్ణ సర్కిళ్లలో బహుళ అంతస్తుల భవనాల బేస్‌మెంట్‌లోకి భారీగా వరద నీరు పోటెత్తింది.

రోడ్లలో మోకాలి లోతున నీరు

పైవంతెన నిర్మాణ పనులు, రోడ్ల మరమ్మతులతో భారీగా వాననీరు చేరింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి నిలిచిన వాన నీటిని తొలగించారు. దీంతో ప్రజలు రోగులు, చుట్టు పక్కల నివాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఉణకల్‌ వద్ద బీఆర్‌టీఎస్‌ కారిడార్‌ వరద నీటితో జలమయం కాగా నగర రవాణాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. తుళజా భవాని సర్కిల్‌లో భారీగా వరద నీరు చేరడంతో అక్కడి వ్యాపారులు కార్పొరేషన్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేసి మొరపెట్టుకున్నారు. ప్రస్తుత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో అంతగా వానలు పడక అన్నదాతల్లో ఆశలు అడుగంటి పోయాయి. తీవ్ర పంట నష్టం, నీటి కొరతతో అల్లాడి పోయిన రైతన్నకు ఈ వర్షం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. విత్తన సాగుకు అనుకూలం కాక పోయినా విత్తన ప్రక్రియకు ముందు చేపట్టే కార్యకలాపాలకు ఈ వర్షం ఉపయోగపడుతుందని రైతులు అభిప్రాయ పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement