స్కూటర్ మీదకు లారీ రివర్స్
బాగేపల్లి: బాగేపల్లి తాలూకాలోని చన్నరాయణపల్లి గ్రామంలో హృదయ విదారక దుర్ఘటన సంభవించింది. స్కూటర్‌లో వెళ్తున్న బాలలు లారీ కిందపడి ప్రాణాలు వదిలారు. విష్ణు (12), విజయరాజ్‌కుమార్ (4) మృతులు. వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం ఉదయం 7 గంటలకు, చన్నరాయణపల్లిలో విష్ణు, బంధువుల అబ్బాయిని తీసుకుని పాలు తేవడానికి స్కూటర్‌లో బయల్దేరాడు. వారి ముందు ఓ లోడు లారీ వెళ్తోంది. ఒక బోర్‌వెల్ లారీ అడ్డుగా వచ్చింది. దానికి దారివ్వాలని లోడు లారీ డ్రైవర్ ఆకస్మాత్తుగా రివర్స్ చేశాడు. వెనుక ఉన్న బాలల మీదకు ఆ లారీని ఎక్కింది. దీంతో లారీ కింద చిక్కుకుని బాలలు తీవ్ర గాయాలతో మరణించారు. నిర్లక్ష్యంగా లారీ నడిపిన డ్రైవర్ శ్రీనివాస్ కూడా అదే గ్రామవాసి అని, పోలీసులు అతన్ని అరెస్టు చేశారని తెలిసింది.
మిన్నంటిన రోదనలు
ఘోరం గురించి తెలిసి గ్రామస్తులు చేరుకుని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. చిక్కబళ్లాపురం ఎస్పీ పద్మిని సాహు, ఏఎస్పీ జగన్నాథ్ రాయ్, సీఐ అజయ్‌సారథి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఎమ్మెల్యే ఎస్.ఎన్.సుబ్బారెడ్డి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు.


