మైసూరు: డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను సైబర్ నేరగాళ్లు బెదిరించి డబ్బు గుంజేస్తున్నారు. తాజాగా ఈడీ అధికారులమంటూ ఒక రిటైర్డు మహిళా అధికారిణి నుంచి రూ.1.63 కోట్లు కొట్టేశారు. వివరాలు.. మైసూరులోని రామకృష్ణ నగరలో నివసిస్తున్న బాధితురాలికి ఇటీవల ఒక గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ ద్వారా ఫోన్ చేశాడు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఆమె ఖాతా నుంచి కోట్లాది రూపాయలు అక్రమంగా బదిలీ చేశారని, మొబైల్ ద్వారా బాలల అశ్లీల వీడియోలు, ఫోటోలు పంపించారని చెప్పాడు. దీనివల్ల మిమ్మల్ని అరెస్టు చేస్తామనడంతో ఆమె భయాందోళనకు గురైంది. తాను నిర్దోషినని, అలాంటి పనులు చేయలేదని ఆమె చెప్పింది. ‘అయితే, మీ ఖాతాలోని డబ్బును మేము చెప్పిన ఖాతాకు బదిలీ చేయండి. దానికి సంబంధించిన పత్రాలు చూపించండి. ఆ డబ్బు మీదే అయితే, మేము దానిని మీ ఖాతాకు తిరిగి జమ చేస్తాము‘ అని సైబర్ నేరగాడు ఒత్తిడి చేశాడు. ఆందోళనకు గురైన ఆ మహిళ, గుర్తు తెలియని వ్యక్తి చెప్పినట్లే చేసింది. పలు విడతల్లో రూ. 1.63 కోట్లు బదిలీ చేసింది. తరువాత కాల్ చేయగా, నేరగాని ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో ఇదంతా మోసమని తెలుసుకుని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.


