● ఆంబిడెంట్ కేసులో హైకోర్టుకు సర్కారు
సాక్షి,బళ్లారి: ఆంబిడెంట్ కంపెనీ మోసం కేసులో గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డికి, ఆయన ఆప్త సహాయకుడు ఆలీఖాన్‌లకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఆంబిడెంట్ కంపెనీ మోసం కేసు నుంచి గాలి జనార్దన్‌రెడ్డి, ఆలీఖాన్‌లను తప్పిస్తూ గతంలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు సదరు వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కాగా హైకోర్టు నోటీసులు జారీ చేసినంత మాత్రాన ఆరోపణలు రుజువైనట్లు అర్ధం కాదని, దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు చట్టబద్ధతను హైకోర్టు తదుపరి విచారణలో పరిశీలించాల్సి ఉంటుందని తెలుస్తోంది.
జెస్కాం అధికారికి వేడుకోలు
● గ్రామాలకు విద్యుత్ సక్రమంగా సరఫరా చేయండి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సక్రమంగా సరఫరా చేయాలని కోరుతూ యాపలదిన్నిలో జెస్కాం ఉప కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన రైతులు అధికారులను ముట్టడించిన ఘటన రాయచూరు తాలూకాలో చోటు చేసుకుంది. గురువారం కార్యాలయాన్ని ముట్టడించిన ఓ రైతు అధికారికి పాదాభివందనం చేసి 12 గంటల పాటు విద్యుత్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించండి
రాయచూరు రూరల్: హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో శరణ బసవ మాట్లాడారు. కార్మికులకు బోనస్, పీఎఫ్, రీయింబర్స్, పదోన్నతులు ఇతరత్ర సమస్యలను పరిష్కరించాలని ఒత్తిడి చేశారు. కార్మికులకు 60 శాతం కనీస వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. కార్మికుల న్యాయసమ్మతమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏడీసీ శివానందకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో పద్మ, అక్కమహాదేవి, శకుంతల, నిర్మల, కళ్యాణమ్మ, మహాదేవి, రాధమ్మ, వరలక్ష్మి, పర్వీనాలున్నారు.
రూపనగుడిలో కిసాన్ మేళా
బళ్లారిఅర్బన్: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) ఆధ్వర్యంలో రూపనగుడి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించేందుకు కిసాన్ మేళా నిర్వహించారు. కార్యక్రమాన్ని జీపీ మాజీ అధ్యక్షుడు నాగరాజు ప్రారంభించారు. సంస్థ మార్కెటింగ్ మేనేజర్ కే.శంకర్ మాట్లాడుతూ రైతుల కోసం పంటలకు ఉపయోగపడే ప్రత్యేక సహాయక పిచికారీ నూనెను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దీనిని పురుగుమందులతో కలిపి పంటలపై పిచికారీ చేయవచ్చన్నారు. పండ్లు, కూరగాయలు, వివిధ రకాల పంటలు, సుగంధ ద్రవ్యాల్లో తెగుళ్ల నివారణకు ఈ సహాయక నూనెను ఉపయోగించవచ్చన్నారు. రైతులు సంస్థ ఆన్‌లైన్ సేవ ద్వారా కూడా దీనిని పొందవచ్చని తెలిపారు. గ్రామ పెద్దలు గోవిందప్ప, లింగరాజు, లింగన్న, శ్రీనివాసులు, లింగమూర్తి, మధు తదితరులు పాల్గొన్నారు.
సరిహద్దుల్లో కన్నడను ప్రోత్సహించాలి
రాయచూరు రూరల్: సరిహద్దు ప్రాంతాల్లో కన్నడ భాషను ప్రోత్సహించాలని కన్నడ మిత్ర కూట అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ పిలుపునిచ్చారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ తాలూకా కృష్ణాలోని హైస్కూల్‌లో కన్నడ మిత్ర కూట, గడినాడు కన్నడ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించి ఆయన మాట్లాడారు. ఇతర భాషల నుంచి కన్నడ ఉనికికి ముప్పు ఉందన్నారు. అన్యభాషలను గౌరవిస్తూ కన్నడకు అధిక ప్రాదాన్యత కల్పించాలన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు అమర దీక్షిత్, రామలింగప్ప, మల్లన గౌడ, బషీర్ అహ్మద్ హొసమని, ప్రధాన ఉపాధ్యాయుడు కిశోర్ కుమార్, మండల విద్యా శాఖాధికారి నిజాముద్దీన్, నరసింహ శెట్టి, నాగేష్, నాగభూషణ్, మ్యాదర్, అనిల్ కుమార్‌లున్నారు.


